విభజన కుట్రలో విజయం ఎవరిది?

F2 Movie

దక్షిణ భారతదేశంలో పెద్ద రాష్ట్రాలలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది. దక్షిణాది మీద పెత్తనం చేయాలనుకునే కేంద్రప్రభుత్వాలకి సౌత్ లో అంతటి బలమైన రాష్ట్రం ఉండటం – మొట్టమొదటినుంచీ ఇబ్బందికరమైన విషయంగానే ఉండేదేమో! ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ని రెండుముక్కలు చేయటానికి తమ శాయశక్తులా కృషి చేశాయని అనుకోవచ్చు.

కాంగ్రెస్ తెలంగాణ తానే ఇచ్చానన్న క్రెడిట్‌ కోసం వెంపర్లాడి, నేరుగా ఆ పాపాన్ని చేతికంటించుకుంటే- బీజేపీ మాత్రం గోడ మీద పిల్లిలా ఆ పాపానికి తనవంతు సాయం చేసింది. మొత్తం మీద ఉత్తరాది ఆధిపత్యానికి తాను కూడా ఆజ్యం పోసింది. అయితే ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టటంద్వారా దక్షిణాది బలం పెరిగిందా? తగ్గిందా? అని ఆలోచించినప్పుడు ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ గతంలో ఏక రాష్ట్రంలో ఉన్నపుడు – ఇక్కడ కేవలం చంద్రబాబు వంటి కొందరు నాయకులే ముందువరసలో ఉండేవారు. కాంగ్రెస్‌ తో పోటీ నిలిచే స్థాయిలో ప్రాంతీయంగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు చంద్రబాబు కంటే మొండిఘటం అనిపించుకునే కేసీఆర్ మరో నాయకుడిగా ఉద్భవించారు. చంద్రబాబు కంటేకూడా ఆయన ప్రస్తుతం ఒక విజయవంతమైన లీడర్ గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ చేసి, ఒక సొంత రాష్ట్రాన్ని తనకు తానే సాధించుకుని ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకి వచ్చింది. ఆ ఆత్మ విశ్వాసం ఆయన మాటల్లో కనిపిస్తూ వస్తోంది. ఈ ఆత్మ విశ్వాసంతోనే ఆయన బీజేపీ,కాంగ్రెస్ రెండిటికీ వ్యతిరేకంగా, అతీతంగా ఒక ఫెడరల్ ఫ్రెంట్ ని స్థాపించాలని ముందుకెళుతున్నారు.

జరుగుతున్న పరిణామాల్ని బట్టి చూస్తే – జాతీయ పార్టీలు ఆశించినది జరగలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ ఏపీలో సర్వనాశనమయింది. తెలంగాణలో కూడా ఏమీ పుంజుకోలేకపోయింది. విభజనకు సహకరించిన బీజేపీ పరిస్థితి కూడా రెండు రాష్ట్రాల్లోనూ ఏమాత్రం మెరుగ్గా లేదు. విభజనకు పూర్వం వరకూ – తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాలుగా – నాలుగు ముఖ్యమైన భాషాప్రయుక్త రాష్ట్రాలు దక్షణాదిలో లెక్కకు వచ్చేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడిరాజధానిని కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమే. కానీ జాతీయ పార్టీలు కుట్రపూరితంగా విభజన చేసి, దానివల్ల ఏదైతే లాభాన్ని ఆశించాయో.. దానికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మొత్తం మీద దక్షిణాదిని కలిపి చూసినప్పుడు – అది గతంలో కంటే మరింత బలీయమైన నాయకత్వంతో ఎదుగుతుండడం శుభపరిణామం అని చెప్పచ్చు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu