విజయ్‌ ‘సర్కార్‌’ జనసేన సినిమా?

F2 Movie

విజయ్‌ ‘సర్కార్’ సినిమా తెలుగువారికి అనుకున్నదానికంటే ఎక్కువ కనెక్ట్‌ అవుతోంది.  సర్కార్‌ అరవసినిమా… అందులోనూ రాజకీయ సినిమా. కాబట్టి ఎంత లేదన్నా మనవాళ్లకి డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టుగా అనిపించాలి. కానీ ప్రస్తుత ఎలక్షన్లో వేడి వల్లనో ఏమో… అది తెలుగు వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా కనెక్ట్ అవుతోంది. నిజానికి ఈ సినిమా తమిళనాడులో విజయ్ రాజకీయ అరంగేట్రం కోసం తయారు చేసుకున్న సినిమా. శంకర్ శిష్యుడైన మురుగదాస్‌, తన గురువు ఫార్ములాలోనే ఈ సినిమా ని తయారు చేశాడు. సమాజానికి నీతి ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌… వీటికి టెక్నాలజీ తోడుగా చేసి…  శంకర్‌ పద్ధతిలోనే కమర్షియల్ సక్సెస్ సాధించే ప్రయత్నం చేశాడు.

ఇది రాజకీయ చిత్రం కావడం వల్ల కేవలం తమిళవారికి మాత్రమే బాగా కనెక్ట్ అవుతుందేమో అనే సందేహం మొదట్లో బాగా ఉంది. గతంలో మణిరత్నం లాంటి గ్రేట్‌ డైరెక్టర్‌ తీసినప్పటికీ – ఎమ్జీఆర్‌, కరుణానిధి కథగా వచ్చిన ‘ఇద్దరు’ … తమిళ రాజకీయ కథ కావడం వల్ల – తెలుగువారికి ఏమాత్రం కనెక్ట్ కాలేదు. ఈమధ్య తెలుగు తమిళాల్లో రిలీజయిన విజయ్‌ దేవరకొండ ‘నోటా’ పరిస్థితి కూడా అదే! విజయ్‌ ‘సర్కార్‌’ విషయంలో అదే అనుభవం పునరావృతం కావచ్చని కొందరు విశ్లేషకులు అనుకున్నారు. అయితే ఈ సినిమా – తెలుగు వారికి అనుకున్న దానికంటే ఎక్కువగా కనెక్ట్ అయిందని చెప్పాలి.

‘సర్కార్‌’ మూవీ కథ తీసుకుంటే – ఇందులో అనుభవజ్ఞుడైన రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి ఒక పక్క, కొత్తగా పార్టీ పెట్టి ఆదర్శాలతో, సరికొత్త రాజకీయ విధానంతో ముందుకు పోయే యువనేత మరొక పక్క – ఉంటారు. సాధారణంగా ఇలాంటి స్టోరీ  ఎలక్షన్ వేడిలో రావడం వల్ల- కథలో పాత్రలుగా చంద్రబాబునీ, పవన్ కళ్యాణ్ నీ మనవాళ్లు ఊహించుకోవడం సహజం. ఇదే జరిగింది.  అయితే తమిళనాడులో వ్యాంప్ పాత్ర వివాదాస్పదమయింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటించిన ఆ పాత్ర పేరు కోమలవల్లి అని పెట్టడం ద్వారా జయలలితని తప్పు పట్టినట్టుగా అక్కడ ఫీలయ్యారు. ఎందుకంటే జయలలిత అసలు పేరు కోమలవల్లి. ఇందువల్ తమిళ ‘సర్కార్‌’ సినిమాని తమిళ సర్కార్‌ కొన్ని చోట్ల బ్యాన్‌ చేయడం కూడా జరిగింది.  అయితే జయలలిత ను పోలిన పాత్రను పక్కన పెడితే – మిగిలిన కథలో కొన్ని భాగాలు ఆంధ్రప్రదేశ్ కథలాగే కొంతమందికి అనిపించడంతో – దీనిని ‘జనసేన సినిమా’గా కొందరు ప్రచారం చేస్తున్నారు. పూర్తిగా పోలికలు లేకపోయినప్పటికీ – కథ మొత్తం ఒక యువ నాయకుడు కి సపోర్ట్ ఇచ్చే విధంగా ఉండడం వల్ల – ఈ సినిమాని జనసైనికులు ఎక్కువ ఆదరించే అవకాశం ఏర్పడుతోంది. మరీ సూపర్ హిట్ కాకపోవడం వల్ల ఆందోళనలు వ్యతిరేకతలు విమర్శలు కాంట్రవర్సీలు వచ్చే అవకాశం తక్కువ. కానీ ఈ రాజకీయ వాతావరణంలో కథాపరంగా తెలుగునాట దీనికి ఆదరణ ఏర్పడుతోంది. ఏదేమైనా జనసైనికులు అంతా సర్కార్ సినిమా చూసి సంతోషిస్తున్నారన్నది మాత్రం నిజం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu