మీకు తెలుసా? ఈ రోజే శివరాత్రి!

SriRamaNavami

మీకు తెలుసా.. ఈ రోజే .. అంటే, 9 ఆగస్ట్ న శివరాత్రి. అదేంటి… శివరాత్రి ఫిబ్రవరి, మార్చిలోనే కదా వచ్చేది? ఇప్పుడు శివరాత్రేమిటి? అనకండి. దీని పేరు సావన్ శివరాత్రి. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్.. ఇంకా పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ లాంటి చోట్ల ‘సావన్ శివరాత్రి’ అనే పేరుతో ఈ ప్రత్యేకమైన శివరాత్రిని జరుపుతారు. ఈ రోజు శివుడికి పూజ చేసి, రోజంతా ఉపవాసం ఉండి, మర్నాడు పారణ చేస్తారు. పారణ అంటే, ఉపవాసాన్ని పూర్తి చెయ్యడం. సూర్యోదయం అయిన తర్వాత చతుర్దశి తిథి వచ్చేలోపే ఏదో ఒకటి తినాలి. అప్పుడే ఆ ఉపవాస ఫలం దక్కుతుందని విశ్వాసం.

అసలు నిజానికి ప్రతి నెలలోనూ ఒక శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనిని మాస శివరాత్రి అంటాం. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి… అంటే 13వ తిథిని మాసశివరాత్రి అంటాం. అయితే, భారతదేశమంతటా చంద్రగమనాన్ని బట్టే సంప్రదాయ క్యాలెండర్లు నడిచినప్పటికీ, నెల అనే దానిని నిర్ణయించడంలో ఉత్తరాదికీ, దక్షిణాదికీ తేడా ఉంది. చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ చంద్రుడి మీద ఆధారపడిన మాసం పూర్ణిమాంతంగా ఉంటుంది. అంటే చిట్టచివరి రోజు పూర్ణిమతో నెల పూర్తయినట్టు లెక్క కడతారు. నెలలో చిట్టచివరి రోజు పూర్ణిమ. అంటే నెల అనేది బహుళపాడ్యమితో మొదలై పున్నమితో పూర్తవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక – ఇలా దక్షిణాదికి వచ్చేసరికి – ఈ చాంద్రమానం ప్రకారం మాసం అనేది అమావాస్యాంతంగా ఉంటుంది. అంటే నెల చిట్టచివరి రోజుగా అమావాస్యని తీసుకుంటారు. శుద్ధపాడ్యమితో మొదలై అమావాస్యతో నెల పూర్తయ్యే విధానం వీళ్లది. కాబట్టి ఇక్కడి లెక్కలకీ, అక్కడి లెక్కలకీ 15 రోజులు తేడా వస్తుంది. అందువల్ల నడిచే నెల పేరు కూడా మారిపోయి అక్కడికీ ఇక్కడికీ తేడా వస్తుంది. శ్రావణంలో వచ్చే శివరాత్రినే వాళ్ళు సావన్ శివరాత్రి అంటారు. ఒక విధంగా పోల్చి చెప్పాలంటే ఈ సావన్ శివరాత్రిని మనం కూడా చేస్తాం. కానీ మనవాళ్ళు ‘ఆషాఢశివరాత్రి’ అన్న పేరుతో – దీనికి 15 రోజుల తేడాలో చేస్తుంటారు. ఎందుకంటే – మనకిక్కడ ఆషాఢ మాసం ఉండగానే వాళ్ళకు శ్రావణమాసం వస్తుంది.
ఈ శ్రావణ శివరాత్రి రోజున ప్రత్యేకంగా రుద్రాభిషేకాలు, శివపూజలు జరుపుతారు. ఉత్తరమైనా, దక్షిణమైనా భక్తి అన్నది భక్తే కదా? ఓం నమశ్శివాయ!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu