మళ్లీ నందమూరిపై నారా గురి?

PremaLekhalu

ఎవరినైనా సరే అవసరమైనప్పుడు ఉపయోగించుకుని తరవాత నిర్లక్ష్యం చేయడం చంద్రబాబు నైజం – అంటూ ఆయన విమర్శకులు, ప్రతిపక్షాలు అంటూ ఉండడం చూస్తుంటాం. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కుటుంబాన్ని ఏనాడూ ఆయన సరిగా ఆదరించలేదని నందమూరి అభిమానులే కొందరు చాటుమాటుగా విమర్శిస్తూ ఉంటారు. ఎన్టీఆర్‌నుంచి తెలుగుదేశం అనే పార్టీని తీసుకుని తనదిగా మార్చుకోగలిగిన చంద్రబాబు – అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు – ఆ తెలుగుదేశం వింటికి నందమూరి అస్త్రాల్ని సంధిస్తూ వాడుతూ ఉంటారు. ఇది చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి చేసే ద్రోహంగా ప్రతిపక్షాలు విమర్శిస్తే – అవసరార్థం అది రాజనీతి అనీ.. చంద్రబాబు చాణక్యం అనీ తెలుగుదేశంవారు చెబుతుంటారు.

తాజాగా చంద్రబాబు తన అమ్ములపొదిలోంచి మరో నందమూరి అస్త్రం తీశారు. అదే నందమూరి సుహాసిని. ఎన్టీఆర్‌ మనవరాలైన ఈమె హరికృష్ణ కుమార్తె, కల్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు సోదరి. తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌ పల్లిలో ఆమెను అభ్యర్థిగా చంద్రబాబు నిలబెడుతున్నారు. నందమూరి కుటుంబం పట్ల జనానికి ఉన్న అభిమానం, కూకట్‌ పల్లిలో ఉన్న ఆంధ్రా జనబాహుళ్యం – విజయకారకాలు కాగలవన్నదే చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. మొదటినుంచీ తాను నిర్లక్ష్యానికి గురయినట్టు భావించిన హరికృష్ణ చంద్రబాబుమీద కినుక వహించడం, తన కుమారుల్ని పార్టీకి దూరంగా పెట్టడం తెలిసిందే. చంద్రబాబు తన సాయంతో ఎన్టీఆర్‌ను పదవినుంచి దింపి, గద్దెనెక్కిన తరవాత తనను నిర్లక్ష్యం చేశారని హరికృష్ణ బాధపడేవారు. ఆ తరవాత కూడా – 2009 లో – జూనియర్‌ ఎన్టీఆర్‌ని ప్రచారానికి వాడుకుని – తరవాత పక్కన పెట్టేయడం హరికృష్ణ జీర్ణించుకోలేకపోయారని అంటారు. ఇటీవల ఆయన మరణం తరవాత మళ్లీ ఆయన కుమార్తెను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించడం గొప్ప విశేషం.

తండ్రినీ కొడుకునీ తరవాత కుమార్తెనీ కూడా తన పార్టీ ప్రయోజనాల కోసం వాడుకున్న చంద్రబాబు అంటూ వైఎస్సార్‌ పార్టీవాళ్లు ఇప్పటికే విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఎన్నో సార్లు చంద్రబాబుని నమ్మి మోసపోయి కూడా మళ్లీ ఆయనకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? – అంటూ హరికృష్ణ అభిమానులు కొందరుసుహాసినిని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. అయితే – నిర్లక్ష్యానికి గురయినట్టు బాధపడుతున్న హరికృష్ణ కుటుంబాన్ని – ఆయన మరణానంతరం ఓదార్చి – ఈ విధంగా ఆదరించి మళ్లీ అక్కున చేర్చుకుంటున్నారనీ, ఓ పక్క బంధు ఆదరణా, మరో పక్క ఎలక్షన్‌ విజయం – రెండింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చేస్తున్న పని మెచ్చుకోదగినదనీ తెలుగుదేశం వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు చాణక్యం అమోఘం, అపూర్వం, అనుపమానం! ఇంతకంటే ఏం చెప్పగలం?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu