మలయాళ సినిమాకి 45 కోట్ల బడ్జెట్టా?

SriRamaNavami

తెలుగులో తమిళంలో ఖర్చుపెట్టినట్టు కన్నడ, మలయాళ సినిమాల్లో ఎక్కువ ఖర్చుపెట్టరన్నది తెలిసిన సంగతే! అయితే ఇప్పుడు బాహుబలి తరవాత అక్కడ కూడా బడ్జెట్లు పెరిగాయి. ఉదా.కి కన్నడలో సుదీప్‌ హీరోగా ఆమధ్య వచ్చిన ‘రన్న'( అత్తారింటికి దారేది ) చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బడ్జెట్‌ భారీతనం మలయాళానికీ పాకిందని చెప్పచ్చు. మాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్న సినిమా ‘కాయంకుళం కొచ్చుణ్ణి’. మలయాళ ‘ప్రేమమ్‌’ హీరో ‘నివిన్ పాలీ’ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ..1830 ప్రాంతంలో కేరళ లో దారిదోపిడీ దొంగగా పేరున్న బందిపోటు కొచ్చుణ్ణి జీవితకథ ఆధారంగా తయారవుతోంది. పెద్దవాళ్లని దోచడం, పేదవాళ్లకి పెట్టడం అనే పంథాలో రాబిన్ హుడ్ తరహాలో సాగే ఈ పాత్రకి – మలయాళీల్లో ఓ క్రేజ్ ఉంది. గతంలోనే … 1966 లో మలయాళ హీరో సత్యన్ ఈ పాత్రని పోషించాడు. ‘కాయంకుళం కొచ్చుణ్ణి’ పేరుతోనే రిలీజైన ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడదే స్టోరీని కొత్తగా,భారీగా తీస్తున్నారు.

రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో గొప్ప ఆకర్షణ ఏంటంటే – నివిన్ పాలీతో బాటు మోహన్ లాల్ ఈ సినిమాలో నటించడం. మోహన్ లాల్ పోషిస్తున్న పాత్ర పేరు కూడా విచిత్రంగా ఉంటుంది – ‘ఇత్తిక్కర పక్కి’ అనే పేరున్న ఈ పాత్ర బందిపోటు కొచ్చుణ్ణికి ప్రాణ స్నేహితుడి పాత్ర. ఈ పాత్రను మోహన్ లాల్ తప్ప మరెవరూ పోషించలేరన్నది రోషన్ అభిప్రాయం. ముందుగా ఈ పాత్రకోసం కమల్ హాసన్ కానీ, నాగార్జునని కానీ అని అనుకున్నారు. అయితే ఆ పాత్ర చివరికి మోహన్ లాల్ని వరించింది.

మాలీవుడ్ లో ఇంతవరకూ చారిత్రక చిత్రాలెన్నో తెరకెక్కాయి కానీ, ‘కాయంకుళం కొచ్చుణ్ణి’ మూవీ మాత్రం తొలిసారిగా భారీ బడ్జెట్ చారిత్రక చిత్రంగా కొత్త రికార్డులు రాస్తోంది. 1830 కాలం నాటి వాతావరణం సృష్టించడం కోసం – ఏడాది నుంచీ ఆ చిత్ర యూనిట్ ఎంతో కష్టపడుతోంది.
ఈ సినిమాని దాదాపు రూ.45 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ల గురించి వినడానికీ, అలాంటి భారీ సినిమాలు చూడ్డానికీ అలవాటు పడిపోయిన మనవాళ్లు.. 45 కోట్లంటే.. “ఓస్‌ … అంతేనా? ” అనేస్తారేమో! కానీ మలయాళ సినీ జనాలు మాత్రం “ఒక్క సినిమాకి 45 కోట్ల బడ్జెట్టా?” అని ముక్కున వేలేసుకుంటున్నార్ట! మరి ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో.. నివిన్ పాలీకి ఏ తరహా ఇమేజ్ నిస్తుందో చూడాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu