మనతో ఉంటే మహాత్ముడు?.. దూరమైతే దుర్మార్గుడు?

PremaLekhalu

ఈ మధ్య ఉప ఎన్నికల్లో బీజేపీ హవా తగ్గడం ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే మొన్న కర్ణాటక ఎన్నికల విషయం తీసుకుంటే మాత్రం బీజేపీ అక్కడ పూర్తిగా ఏమీ ఓడిపోలేదు. నిజానికి అందరికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నది బీజేపీనే. అయినప్పటికీ అక్కడ బీజేపీ పట్ల ఉండే వ్యతిరేకత అయితేనేం, ప్రతిపక్షాల మధ్య ఏర్పడ్డ ఐక్యత అయితేనేం – కారణమేదైనా ఎక్కువ సీట్లుండి కూడా ఒక రాష్ట్రాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. అయితే అంత మాత్రాన బీజేపీ సర్వనాశనం అయిపోయింది, ఇక బీజేపీ అనేది సౌత్ లో లేనే లేదు అని తెలుగుదేశం వారు మాట్లాడుతున్నారు. కానీ గతంలోకంటే బీజేపీకి ఎక్కువసీట్లు వచ్చాయన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఏదో బీజేపీని దెబ్బతీసేందుకు పచ్చగడ్డి భగ్గుమనే జేడీఎస్‌, కాంగ్రెస్‌ కాసేపు అక్కడ జత కట్టారు తప్ప, వాళ్ల మధ్య ఇటీవల ఏర్పడుతున్న లుకలుకలు చూస్తుంటే – మళ్లీ బీజేపీకి ప్లస్‌ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది.

ఏదో తాము బీజేపీ నుంచి విడిపోయాం కదా అని ఇంక మొత్తం బీజేపీ సర్వనాశనం అయిపోయినట్టు భారతదేశంలోనే ఇక బీజేపీ హవా గని మోడీ హవా గని లేనట్టు తెలుగుదేశం వర్గాలు అతి ప్రచారానికి తెర తీస్తున్నాయ్. చంద్రబాబు నుంచి విడిపోగానే ఎవరైనా దెబ్బతినేస్తారు అన్నంత స్థాయిలో ఈ ప్రచారం సాగుతోంది. నిజానికి బీజేపీ అంత ఘోరమైన పరిస్థితిలో ఏమీ లేదు.

కానీ ఈ ఉపఎన్నికల్లో సీట్లు రాబట్టుకోలేకపోవటం మాత్రం బీజేపీ నిజంగా ఆలోచించుకోదగిన పరిణామం. దీన్ని ఆసరాగా తీసుకుని తెలుగుదేశం వర్గాలు బీజేపీ మొత్తం దెబ్బ తినేసింది అనే స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మనతో ఉంటే మహాత్ముడు, దూరమైతే దుర్మార్గుడు అన్న రీతిలో సాగుతున్న తెలుగుదేశం తీరుని పోసాని కృష్ణమురళి తీవ్రంగా విమర్శించడం మనం చూశాం.

అలాగే ఇక బీజేపీ తరఫున టీవీల్లో మాట్లాడటానికివచ్చే వాళ్ళు చేస్తున్న తప్పులు కొన్ని ఉన్నాయ్. వీళ్ళు ఎంతసేపూ బీజేపీని వెనకేసుకురావటం, మోడీని విపరీతంగా పొగడడం తప్ప, ఆత్మగౌరవం ఉన్నవారిలా ప్రవర్తించడం లేదు. ఎంత సేపూ పార్టీకీ మోదీకీ సపోర్ట్‌ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంటున్నారే గానీ -“అయ్యో ఆంధ్రాకి నష్టం జరిగింది, దీనికి మనం పార్టీ తరఫున ఏదయినా చెయ్యాలి ” – అన్న బాధ్యతను ప్రదర్శించలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీకి అన్యాయం జరిగిన నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటూ, లేదు మనకి మేలు చేస్తారు, అనే భావన కలిగిస్తూ మోడీ ని సపోర్ట్ చేస్తే బాగుంటుంది కానీ – అస్సలు అన్యాయమే జరగలేదు. బీజేపీ మనకి మేలే చేసింది అన్నట్టు మొండిగా వాదించటం సరయిన పని కాదు. ఇందువల్ల – బీజేపీకి ఆంధ్రాలో ఉన్న పరువు కూడా పూర్తిగా పోతుంది.

ఇక తెలుగుదేశం అయితే – ఉన్నదాన్ని ఎన్నో రేట్లు చేసి ఎక్కువ చెప్పి, మోదీ ప్రభావం మొత్తం పోయింది అన్న రీతిలో అతి చేసి చెబుతున్నారు. ఈ రెండు పద్ధతులూ కూడా సరయినవి కావు. ఎక్కడైనా సత్యాన్ని ఉన్నదున్నట్టు మాట్లాడుతూ – సపోర్ట్ చేస్తే బాగుంటుంది తప్ప, సత్యాన్ని మరుగునపెట్టి తమ నాయకులని, పార్టీలని సపోర్ట్ చేసుకుంటూపోతే జనం హర్షించరు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu