“బ్యాంకులన్నీ మావి! లోన్లన్నీ మీవి! “

F2 Movie

“సార్‌, మేం హెచ్ డీఎఫ్ సీ నుండి కాల్ చేస్తున్నాం.. మీకు లోన్ కావాలా? సార్‌.. మేం ఐసీఐసీఐ నుంచి కాల్ చేస్తున్నాం… ప‌ర్స‌న‌ల్ లోన్ ఏమైనా రిక్వైర్‌ మెంట్‌ ఉందా? స‌ర్ మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం… మీరు లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫ‌ర్ చేసుకునే అవకాశం ఉంది సార్… మీకేమైనా అవ‌స‌రం ఉందా?”

– ఇలాంటి కాల్స్ మీకు వ‌స్తున్నాయా? అయితే జవాబిచ్చే ముందు – ఒక్క క్ష‌ణం ఆగండి. వీళ్లంద‌రూ నిజానికి ఆ బ్యాంకుల నుండి నేరుగా ఫోన్‌ చేస్తున్న‌వాళ్లేనా? – అని ఆలోచించండి! కాదు. కానే కాదు. వీళ్ల‌లో చాలామంది ఆ బ్యాంకుల నుంచి చేయట్లేదు. వీళ్లలో నూటికి దాదాపు 99 శాతం థ‌ర్డ్ పార్టీల వాళ్లే.

బజార్లోకి బ్యాంకులు

“సార్, ఫలానా బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నాం లోన్ అవకాశం మీకు ఉంది” – అన‌గానే నిజంగానే వాళ్లు మ‌న‌కి లోన్ ఆఫరిస్తున్నారేమో అనుకుని వెంట‌నే సై అన‌కండి. మ‌న అవ‌స‌రాల‌తో వాళ్లు లాభం పొంద‌టానికి కొన్ని థ‌ర్డ్ పార్టీలు ప్లే చేస్తున్న ట్రిక్‌ ఇది! మీ సిబిల్‌ స్కోర్‌ బాగుంటే – చెక్‌ చేసి మీకు లోన్ తీసుకునే అవకాశం ఉంద‌ని చెప్ప‌డం, ఏదో ఓ బ్యాంక్‌ ద్వారా లోన్‌ ఇప్పించడం త‌ప్పేమీ కాదు. పైసా బజార్‌ , బ్యాంక్‌ బాజార్ లాంటి ధ‌ర్డ్ పార్టీ సంస్థ‌లు రోజూ చేసే పని ఇదే! ఇవి జనాల సిబిల్‌ స్కోర్లు చెక్‌ చేసి, జ‌నాల‌కి కాల్‌ చేసి లోన్స్‌ ఇప్పిస్తూ మధ్యలో కమిషన్‌ తీసుకుంటూ ఉంటాయి. అయితే అభ్యంతరం ఏమిటంటే – వీళ్లు మనకి కాల్ చేసేట‌ప్పుడు నిజం చెప్పకపోవడం. తమని నేరుగా బ్యాంక్‌ ఉద్యోగులుగా పరిచయం చేసుకోవడం!

వీళ్లు బ్యాంకులోళ్లు కాదురో …

“సార్‌, ఫలానా పైసాబజార్‌, లేదా బ్యాంక్‌బ‌జార్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నాం…” అంటే మ‌నం వాటికంత ప్ర‌యారిటీ ఇవ్వ‌క‌పోవచ్చుననే ఉద్దేశంతో కాబోలు, స్వయంగా బ్యాంక్‌నించే మాట్లాడుతున్నట్టు పరిచయం చేసుకుంటున్నారు. పెద్ద పేరున్న ఏ ఐసీఐసీఐ నుంచో ఎస్బీఐ నుంచో డైరెక్ట్ గా మనకి కాల్‌ చేస్తున్నట్టు పోజు కొడతారు. మనం నిజం అనుకుని, వాళ్ల బుట్టలో పడతాం. నిజానికి ఇలా థర్డ్‌ పార్టీలు ఇలా దొంగ పేర్లు చెప్పి కాల్స్‌ చేయడం చ‌ట్ట‌రీత్యా నేరం! మనం వాళ్లని నమ్మేది ఆ బ్యాంక్‌ పేరు చూసి మాత్రమే! ఆ బ్యాంకు మీద ఉన్న ట్ర‌స్టుని ఆధారంగా చేసుకుని లోన్‌ ఇప్పిస్తానని ఆ తరవాత వాళ్లు మ‌నల్ని మోసం చేసినా మ‌నం ఏమీ చేయ‌లేం. ఒకవేళ వాళ్లు నిజాయతీగా ప్రయత్నించినా వాళ్ల వల్ల లోన్‌ రాకపోతే – లోన్‌ అప్లై చేసినందుకు మన సిబిల్‌ స్కోర్‌ డౌన్‌ అయిపోతుంది. అందువల్ల మన క్రెడిబిలిటీ తగ్గి, లోన్స్‌ వచ్చే ఛాన్సే తగ్గిపోతుంది. మరి వాళ్లు ఫెయిలయితే – మనకి జరగగల సిబిల్‌ స్కోర్‌ నష్టానికి వాళ్లు ఎంతమాత్రం బాధ్యత కూడా వహించరు.

ఎలా చెక్‌ చేసుకోవాలి?

కాబ‌ట్టి మీరు ఇలాంటి ఆఫ‌ర్ల‌ని యాక్సెప్ట్ చేసే ముందు – వాళ్లు నిజంగా ఆ బ్యాంకు నుంచి చేస్తున్నారా? లేక‌పోతే థ‌ర్డ్ పార్టీయా? అన్న‌ది తప్పనిసరిగా చెక్ చేసుకోండి.. ఇదెలా చెక్ చేసుకోవాలంటే..

ఆల్రెడీ లోన్‌ ఉన్న సంగతి చెప్పి – ఆ లోన్‌ తాలూకు వివరాలు వాళ్లని చెప్పమని అడగాలి. ఎందుకంటే – మీకు ఎస్బీఐ వాళ్లు లోన్‌ ఇచ్చారనుకోండి.. ఆల్రెడీ మీకు ఉన్న లోన్‌ని మీరు కరెక్ట్‌ గా రి-పేచేస్తేనే టాప్‌ అప్‌ ఇస్తారు కాబట్టి – “నా నడుస్తున్న లోన్‌ వివరాలు చెప్పండి ఒకసారి… నాకు గుర్తు లేదు”…. అనండి. వెంటనే చెప్పగలిగారనుకోండి. వాళ్లు డైరెక్ట్‌ గా ఎస్బీఐ నుంచి చేసినట్టు! లేదంటే థర్డ్‌ పార్టీ వాళ్లని అర్థం!

అలా అడిగితే అంతే!

దీన్ని టెస్ట్ చేయ‌డానికి మీరేం చేస్తారంటే.. “సార్‌, మేం ఫ‌లానా హెచ్‌డీఎఫ్‌సీ నుండి కాల్ చేస్తున్నాం” – అన్నార‌నుకోండి. “మీరు నిజంగా హెచ్‌డీఎఫ్సీ నుంచేనా? ” – అని అడ‌గండి. ” అబద్ధం చెప్పినా వీళ్లకేం తెలుస్తుందిలే… అన్నట్టు వాళ్లు – “అవునండీ, హెచ్‌డీఎఫ్‌ సీ నుంచే కాల్‌ చేస్తున్నాం” – అంటారు. అప్పుడు మీరు లోన్‌ అక్కర్లేదు అని చెప్పకుండా… – హెచ్‌డీఎఫ్‌ సీ లో నా పాత లోన్‌ ఒకటి రన్‌ అవుతోందండీ… కొత్తలోన్‌ వద్దుగానీ… ఆ పాతదాని మీద టాప్‌ అప్‌ ఇప్పించండి… ” అని అడగండి. ( టాప్‌ అప్‌ ఆఫర్‌ అంటే – ఒక లోన్‌ నడుస్తున్నప్పుడు – మనం తేడా లేకుండా ప్రతినెలా ఈఎమ్‌ఐలు కట్టేస్తుంటే – లోన్‌ అమౌంట్‌ పెంచుతారు. పెంచినప్పుడు – పాత లోన్‌ వాళ్లే కట్టేసి క్లియర్‌ చేసేసి – మిగిలిన పెంచిన అమౌంట్‌ మీకు ఇస్తారు. ) ఇలా అడగ్గానే వాళ్లు – థర్డ్‌ పార్టీ వాళ్లయితే – లోన్‌ వివరాలు మననే అడుగుతారు. అప్పుడు మీరు చెప్పకుండా – “అదేంటండీ, మీరు హెచ్‌డీఎఫ్‌సీ నుంచి డైరెక్ట్‌ గా చేస్తున్నారు కదా? కాల్‌ చేశారంటే – నా ఫోన్‌ నంబర్‌ కూడా మీ దగ్గరున్నట్టే! కాబట్టి నా లోన్‌ వివరాలు మీకు తెలిసే ఉండాలి. అసలు అలా తెలిసే మీరు కాల్‌ చేసి ఆఫర్‌ ఇస్తున్నారని అనుకున్నా. ” అనండి. “అంటే సార్‌, మేం బ్యాంక్‌ నుంచే చేస్తున్నాం. కానీ ఆ డిటైల్స్‌ మా దగ్గరుండవు. మీరే మీ పాత లోన్‌ వివరాలు చెప్పండి. కనుక్కుంటాం. ” అంటారు.

వాళ్లు ఫెయిలయితే మీ సిబిల్ స్కోర్ డౌన్!

మీరు ఏ మాత్రం తగ్గకుండా – “లోన్‌ కి నేను అర్హుణ్ణని మీరే చెబుతున్నారు. అంటే వివరాలు మీ దగ్గరున్నట్టే కదా? నన్ను అడుగుతారేంటి? నాకు నా పాత లోన్‌ వివరాలు గుర్తు లేవు. మీరే చెప్పండి ” – అనండి. దెబ్బకి వాళ్లు థర్డ్‌ పార్టీ అయితే కన్ఫర్మ్‌ అయిపోతుంది. కంగారుపడతారు. వాళ్లు మ‌ళ్లీ ఎక్క‌డో క‌నుక్కుని చెప్పే అవకాశం ఇవ్వకుండా ఆ డీటైల్స్ వెంట‌నే చెప్ప‌మ‌నండి.. లేదండీ ఆ వివ‌రాలు మా ద‌గ్గ‌ర ఉండ‌వు – అన్నారు అంటే… బ్యాంకు నుంచి డైరెక్ట్‌గా వ‌చ్చిన కాల్ కాద‌న్నమాట.. మనం ఎప్పుడూ – లోన్‌ ఆఫర్‌ కాల్‌ వచ్చినపుడు – అది బ్యాంకా? థర్డ్‌ పార్టీనా అన్న విషయంలో ఎప్పుడూ కేర్‌ఫుల్‌ గా ఉండాలి. ఎందుకంటే – బ్యాంకు నుంచి డైరెక్ట్‌ గా వచ్చే ఆఫర్‌ జెన్యూన్‌ గా ఉంటుంది. మీరు గతంలో చేసిన బ్యాంకింగ్‌, పేమెంట్స్‌ ఆధారంగా వాళ్లు ఏదయినా ఆఫర్‌ చేస్తే – చాలా ఈజీగా పని అయిపోతుంది. అలా కాకుండా – అది థర్డ్‌ పార్టీ వాళ్లు వాళ్ల సొంత బతుకుతెరువు కోసం – మిమ్మల్ని ఉపయోగించుకుంటే మాత్రం – చాలా సార్లు లోన్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు. లోన్‌ వస్తే ఓకే. కానీ వాళ్ల అసమర్థతకి ఫలితంగా – మన సిబిల్‌ స్కోర్‌ డౌన్‌ అయిపోతుంది. ఇలా ఓ రెండు మూడు సార్లు జరిగితే – మనకి తరవాత తరవాత లోన్స్‌ వచ్చే ఛాన్స్‌ పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల లోన్‌ ఆఫర్‌ అంటూ కాల్‌ రాగానే ఎగిరి గంతేయకండి. అసలైనవాళ్లెవరు, ఆత్రగాళ్లెవరన్న విషయం కనిపెట్టండి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu