ప‌వ‌న్ కి రాజకీయ అవ‌గాహ‌న ఉన్నట్టా? లేనట్టా?

PremaLekhalu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలుగుదేశం నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి రాజ‌కీయాల మీద అత‌ని అవ‌గ‌హ‌న రాహిత్యం గురించి ప్ర‌చారం ఎక్కువైన మాట నిజం. సినిమాల నుండి వ‌చ్చిన వాళ్ల‌కి రాజ‌కీయ అవ‌గాహ‌న ఉండ‌దు అన్న‌ది జ‌నంలో ఎప్ప‌టి నుంచో ఉన్న అభిప్రాయం. ఒక సినిమా న‌టుడు త‌న‌ని తాను రాజ‌కీయ నాయకుడుగా నిరూపించుకునే వ‌ర‌కూ ఈ అనుమానాలు అంద‌రినీ వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే- ఇటు దక్షిణాదిలో తీసుకున్నా, అటు ఉత్తరాదిలో తీసుకున్నా – సినిమాల నుంచి రాజకీయాల్లోకి వ‌చ్చి విజ‌యం సాధించిన వాళ్ల కంటే – దెబ్బ‌తిన్న వాళ్లే ఎక్కువ మంది. తెలుగువరకూ తీసుకుంటే – ఎన్టీఆర్ త‌రవాత సినిమాల నుంచి వ‌చ్చిన పెద్ద హీరోలైన కృష్ణ, కృష్ణంరాజు కూడా – రాజ‌కీయాల్లో ఏదో ఓ మూల సర్దుకుపోయారే తప్ప- తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్‌ వేయలేకపోయారు. అలా మార్క్‌ వేయగలడనుకున్న చిరంజీవి అవగాహన రాహిత్యంతో – పూర్తిగా ఫెయిలయ్యారు.

అయితే – అభిమానులు అంగీకరించినా అంగీకరించకపోయినా- ఎన్టీఆర్‌ కూడా రాజకీయదురంధరుడేమీ కాదన్నది సత్యం. ఒక విధంగా చెప్పాలంటే బోళా మనిషని అంటారు. అప్పుడు కూడా చంద్రబాబే వెనకుండి చక్రం తిప్పేవాడనీ అంటారు. పరిపాలనపరంగా అవగాహన లేకుండా ఎన్టీఆర్‌ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మహాత్మా గాంధీ గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో తెలుసా? గాంధీ ఏం చదువుకోలేదన్న భావంలో – ” చదువు అంత ముఖ్యమేం కాదు, అంత గొప్పవాడయిన మహాత్మా గాంధీ ఏం చదువుకున్నారు? ” అనడం జరిగింది. గాంధీ వేషాన్ని బట్టి ఆయన నిరక్షరాస్యుడని ఎన్టీఆర్‌ అనుకున్నారో ఏమో, కానీ నిజానికి గాంధీ విదేశాల్లో బారిస్టర్‌ చదివి వచ్చిన మేధావి. అప్పట్లో ఎన్టీఆర్‌ కామెంట్‌ చాలా విమర్శలు వచ్చాయి. ఇలాగే ఉద్యోగుల ఎర్న్‌డ్‌ లీవ్‌ ల అమ్మకం విషయంలోనూ, కొన్ని పాలన విషయాల్లోనూ ఎన్టీఆర్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడిన రుజువులు అనేకం ఉన్నాయి. పాత పేపర్లు తిరగేసినా, సూపర్‌ స్టార్‌ కృష్ణ ఎన్టీఆర్‌ని విమర్శిస్తూ తీసిన సినిమాలు చూసినా వీటిలో కొన్ని ఉదాహరణలు కనిపిస్తాయి.

అయితేనేం, పాలన లో ప్రతివిషయంలోనూ అవగాహన లేకపోయినా – ఎన్టీఆర్‌ ఓ సక్సెస్‌ఫుల్‌ లీడర్‌ గా నిలబడ్డారు. ఇందుకు కారణం ఏమిటి? ఎన్టీఆర్‌లో కనిపించే ఆవేశం అని విశ్లేషకులంటారు. తెలుసా తెలియదా అన్నది ముఖ్యం కాదు, జనానికి ఏదో ఒకటి చేయాలనే ఆవేశం ఉన్నప్పుడు – విషయాలు ఒక్కటొక్కటిగా అవే తెలుస్తాయి. ఎలా వెళ్లాలో దారి చూపిస్తాయి. ఎన్టీఆర్‌ విషయంలో అదే జరిగిందని అనిపిస్తుంది. ఆయన పెట్టిన 2 రూపాయల కిలో బియ్యం లాంటివి – మొదట్లో ఆవేశపూరిత నిర్ణయాలుగా విమర్శలు ఎదుర్కున్నప్పటికీ – కాలపరీక్షలో నెగ్గి ఆయనకి పేరు తీసుకొచ్చాయి. ఇందుకు కారణం – ఓ నిజమైన ప్రజాసేవాపరమైన రాజకీయ ఆవేశం కలిగి ఉండడం! ఇప్పుడు అలాంటి రాజకీయ ఆవేశం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో మాత్ర‌మే క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌నకి అవగాహన లేదన్న విమ‌ర్శ‌కుల కామెంట్స్ ని తిప్పి కొడుతూ – ” ఏ జిల్లా గురించయినా నేను డిస్క‌స్ చేయ‌గ‌ల‌ను, నేను ఐఏఎస్ ఆఫీస‌ర్ల మీద ఆధార‌ప‌డి విష‌యాలు తెలుసుకునే వ్య‌క్తిని కాదు. నా అంత‌ట నేను చ‌దువుకుని నేర్చుకున్నాను. అవ‌గ‌హ‌నతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను” అని చెప్పారు. నిజంగా ఇలా చెప్ప‌గ‌ల‌గ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యమే! అయితే బుకిష్ నాలెడ్జ్ కేవ‌లం పుస్త‌క జ్ఞానం అన్న‌ది ప్రాక్టిక‌ల్‌ గా రాజ‌కీయాల‌కు ప‌నికొస్తుందా లేదా అన్న‌ది భ‌విష్య‌త్తులో ప‌వ‌న్ తనకు తానుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రజాసేవాపరమైన ఆవేశం అన్నది ఉంది కాబట్టి – అదే పవన్‌కి అన్నీ నేర్పుతుందని అనేవాళ్ల అభిప్రాయాన్నీ కొట్టి పారేయలేం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu