పోర్న్ సైట్స్‌కి ప్రత్యేక ర్యాంక్‌లు ఇవ్వండి!

F2 Movie

ఇంటర్నెట్‌లో ఏ వెబ్ సైట్స్‌కి ఎక్కువ ప్రజాదరణ ఉందో సూచించే ర్యాంకులిచ్చే పనిని అలెక్సా (alexa.com ) లాంటి కొన్ని సైట్స్, చేస్తుంటాయి. ఈ ర్యాంకులను బట్టే వెబ్ సైట్స్‌కి యాడ్స్ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పోర్న్ సైట్స్ వల్ల – అభివృద్ధి చెందుతున్న వెబ్స్ సైట్స్ ‌కి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అశ్లీలమైన కంటెంట్ ద్వారా జనాన్ని అడ్డదారిలో సులువుగా ఆకట్టుకుంటున్న పోర్న్ సైట్స్… నిజాయతీగా మంచి కంటెంట్‌ తో టాప్ ర్యాంకులు పొందడానికి ప్రయత్నించే వర్ధమాన సైట్లకు పెద్ద ఆటంకంగా తయారవుతున్నాయి.

ప్రపంచంలో టాప్ ర్యాంక్స్‌ అన్నీ… ఇప్పటికే గూగుల్, ఫేస్‌బుక్‌, యాహూ లాంటి పెద్ద పెద్ద కంపెనీల తాలూకు వెబ్‌సైట్ల వశం అయిపోయాయి. ఎందుకంటే, ఆ సంస్థల భారీ నేపథ్యం గానీ, గుత్తాధిపత్యం కోసం అవి చేసే నిత్య ప్రయత్నాలు గానీ … వాటిని టాప్ ర్యాంక్స్‌లో నిలబెడుతున్నాయి. సాధారణ స్థాయి వెబ్‌సైట్స్ ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా – ఈ దిగ్గజాల్ని ఎదుర్కోవడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక మధ్యలో ఈ పోర్న్ సైట్ల బెడద ఒకటి!

ఏ దేశం ర్యాంకింగ్స్ తీసుకున్నా… మొత్తం ప్రపంచవ్యాప్తంగా ర్యాంకులు చూసినా… ఎన్నో పోర్న్ సైట్స్ టాప్‌లో ఉంటున్నాయి. పెద్ద పెద్ద అంతర్జాతీయ దిగ్గజాలతో పోరాడలేక సతమతమవుతున్న వర్ధమాన సైట్లు – ఎంత గొప్ప కంటెంట్ ఇచ్చినా పైకి రాలేక పోవడంలో – ఈ పోర్న్ సైట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.

మరేం చేయాలి? అసలు మామూలు సైట్ల ఆదరణని కొలిచి ర్యాంకులిచ్చే మామూలు ర్యాంకింగ్ సిస్టమ్‌లో పోర్న్ సైట్లకి చోటివ్వకుండా ఉండాలి. పోర్న్‌ సైట్లకంటూ ఓ ప్రత్యేకంగా ఒక ర్యాంకింగ్ సిస్టమ్‌ పెడితే నయం. ఎందుకంటే, అవి మనుషుల బలహీనతని ఆధారంగా చేసుకుని ఎదగాలనీ, సంపాదించాలనీ అనుకునే వెబ్ సైట్లు. ఎప్పుడైతే మనుషుల బలహీనతల్ని ఆధారంగా చేసుకున్న సైట్లు గొప్ప ర్యాంకుల్లో కనిపిస్తున్నాయో… అప్పుడు మంచి కంటెంట్ ఇవ్వగల వెబ్ సైట్లు కూడా ర్యాంకుల కోసం – పూర్తిగా పోర్న్‌ కంటెంట్‌ ఇవ్వకపోయినా – సాధ్యమైనంతవరకూ అడ్డదారులు తొక్కి ఉన్నంతలో చెత్తరాతలు రాయడం మొదలయింది. ఇది ఇంటర్‌నెట్‌ మొత్తాన్ని కలుషితం చేస్తున్న దుష్పరిణామం.

కాబట్టి – మనుషుల బలహీనతల్ని ఆధారంగా చేసుకుని ప్లే చేసే వెబ్ సైట్లన్నిటికీ ప్రత్యేకమైన ర్యాంకింగ్ ఇచ్చినప్పుడే ఇంటర్నెట్‌లో కంటెంట్ బాగుపడుతుంది. పోర్న్‌ సైట్ల మధ్య పోటీనంతటినీ ఓ ప్రత్యేక ర్యాంకింగ్‌ సిస్టమ్‌ తో పక్కన పడేయాలి. అశ్లీలతా చెత్తరాతలూ లేని సిన్సియర్‌ వెబ్ సైట్లకు మెయిన్‌ స్ట్రీమ్‌ లో ర్యాంకింగ్ ఇవ్వాలి. అప్పుడే చీప్‌ అండ్‌ టాప్‌ అనిపించుకునే పోర్న్‌ సైట్లతో పోటీపడే అవసరం తగ్గి, మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాయి మామూలు సైట్లు. ఆ విధంగా మొత్తంమీద ఇంటర్‌నెట్‌ క్వాలిటీపరంగా బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోర్న్ సైట్లకు ప్రత్యేకమైన ర్యాంకులిచ్చే విధానం వచ్చి తీరాల్సిందే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu