దక్షిణ భారతదేశానికి భాషా స్వతంత్రం ఉందా?

SriRamaNavami
( ఈ ఆర్టికల్ కాస్త దీర్ఘంగా అనిపించవచ్చు. కానీ చివరివరకూ చదవండి. ఎందుకంటే – దీని నిండా తెలుగువాడి దశాబ్దాల ఆవేదన ఉంది. దక్షిణాది భాషాభిమానుల హృదయరోదన, ఆక్రోశం ఉన్నాయి. అన్నిటినీ మించి అణువణువునా నిజాలున్నాయి. మీరు నిజమైన తెలుగువారయితే  ఇది చదవడం మీ బాధ్యత! చదవండి. నలుగురికి పంపండి! తెలుగువారి ఆత్మగౌరవాన్నీ, దక్షిణాది ఆవేదననీ అందరికీ తెలియజెప్పండి! అఖండభారతావని సమగ్రతకి మీ వంతు అండగా నిలబడండి! )

యూట్యూబ్‌ లో “హర్‌ భాషా ఈక్వల్‌” అంటూ వస్తున్న వీడియోలు చూశారా? #HarBhashaEqual అనే ట్యాగ్‌ సరిగ్గా గమనించారా? ఇప్పుడు యూట్యూబ్‌లో – ప్రముఖ న్యూస్‌ యాప్‌ ‘డెయిలీ హంట్’ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ట్యాగ్ పాపులర్‌గా నడుస్తోంది. “హర్ భాషా ఈక్వల్ (#HarBhashaEqual)” అట. చిత్రమేంటంటే – అసలు ఆ ట్యాగ్‌లోనే ఈక్వాలిటీ ( సమానత్వం ) అన్నది కనిపించడం లేదు. “హర్ భాషా ఈక్వల్” అంటే… హిందీలో పెట్టారు. ఇందులో మొదటి పదమే హిందీ. హర్ అనేది పూర్తి హిందీ పదం. మరి ఇక ఈక్వాలిటీ ఏమిటి? సమానత్వం ఏమిటి? నిజంగా అన్ని భారతీయ భాషలకీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటే – ట్యాగ్‌ లైన్‌ సంస్కృతంలో గానీ, ఇంగ్లిష్‌ లో గానీ పెట్టి ఉండాలి. ఎందుకంటే – సంస్కృతం అన్నది ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికీ చెందింది కాదు. అలాగే ఇంగ్లిష్‌ కూడా దేశంలోని ఏ రాష్ట్రానికీ చెందినది కాదు. సంస్కృతంలో పెట్టినా – ద్రవిడ సంస్కృతి కలిగిన తమిళుల్లాంటివారు దాన్ని స్వీకరించగలరని అనుకోలేం. కాబట్టి – #HarBhashaEqual అంటూ హిందీ డామినేషన్‌ చూపించడం కంటే – దేశ భాష కాకపోయినా పూర్తిగా ఇంగ్లిష్‌ #EveryLanguageEqual అని పెట్టాలి. పోనీ కాస్త ఇండియన్‌ ఫ్లేవర్‌ కావాలనుకుంటే – #EveryBhashaEqual అని అనచ్చు.

#HarBhashaEqual అంటూ క్రియేట్‌ చేసిన ఈ ట్యాగ్‌ లో – మధ్యలో ఉన్న ‘భాష’ అన్న పదం మారుస్తూ యానిమేట్‌ చేయడం జరిగింది. అన్ని భాషలూ మాకు సమానమే అన్నట్టు చెప్పారు. కానీ ఎప్పడైతే మొట్టమొదటి పదంగా ‘హర్‌’ ( దీనికి అర్థం ప్రతి – every ) అని హిందీ పదం యాడ్‌ చేశారో.. ఆ క్షణమే సమానత్వం అన్నది చచ్చిపోయినట్టనిపిస్తుంది. ఎన్ని ఇతర భాషల యానిమేషన్లు తిప్పినా – హిందీకే పెద్ద పీట వేశారనడానికి మొట్టమొదటి పదమే ఓ తిరుగులేని రుజువు. అదేంటి? హిందీ జాతీయ భాష కదా? దానికి ప్రాధాన్యం ఉంటే తప్పేంటి? అనేవాళ్లూ కొందరుండచ్చు. అయితే – హిందీతో పాటు అన్ని భాషలకీ ఇప్పుడు జాతీయ స్థాయి భాషగా గుర్తింపు ఉందన్నది వాళ్లు గుర్తించాలి. అసలు హిందీ భారతదేశంలో హిందీ అనేది ఒక అఫిషియల్ భాషే తప్ప – వాళ్లు గొప్పలు చెప్పుకునేట్టు – జాతీయ భాష ఏమీ కాదనీ, అన్ని భాషలకీ సమప్రాధాన్యం ఉందనీ స్వయంగా  కోర్టే చెప్పింది. ( సందేహం ఉంటే ఈ లింక్ లో చూడవచ్చు.  )

అయినా ఓ పక్క ఒక భాషకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ –  ఇంకోపక్క అన్ని భాషలూ సమానమే అని అరిస్తే – ఆ ట్యాగ్‌ కి అర్థం ఏముంటుంది? అలాంటి ట్యాగ్‌ తో భారతదేశానికి అవసరం ఏముంది?

అయినా ‘భాష’ అనేదాన్ని ప్రతి భారతీయ భాషలోనూ భాష అనరు. తమిళంలో మొళి అంటారు. ఉర్దూలో జబాన్‌ అంటారు. ఉత్తరాది భాషల్లో దీర్ఘం తీసి, ‘భాషా’ అంటే మనం దక్షిణాదిలో ‘భాష’ అంటాం. దక్షిణాదిలో కూడా – కన్నడంలో ‘భాష’ అనరు. ఆ భాష విధానాన్ని బట్టి ‘భాషె’ అంటారు. ఇన్ని వైవిధ్యాలు ( వేరియేషన్స్ ) ఉండగా – ఒక ట్యాగ్ అందరికీ సరిపోవాలంటే అది ఇంగ్లిష్ మాత్రమే అయి ఉండాలి. కాబట్టి #HarBhashaEqual అన్నది కొన్ని భారతీయ భాషల వాళ్లకి సంబంధం లేని పదబంధం. ఉదాహరణకి తమిళుల్నే తీసుకోండి. వాళ్లు అసలు ఈ ట్యాగ్‌ ని ఎందుకు ఆదరించగలుగుతారు? ఎలా స్వీకరించగలుగుతారు? హర్‌ అన్నది చూస్తే హిందీ పదం. వాళ్లకి సంబంధమే లేదు. ఇక రెండో పదం ‘భాష’. ఆ పదం వాళ్లకి వాడుకలోనే లేదు. ఎందుకంటే వాళ్లు భాషని మొళి అంటారు. ఇక మూడోది – ఈక్వల్‌ అన్నది ఇంగ్లిష్‌ పదం. అదొక్కటే కాస్త అందుబాటులో ఉన్నపదం. అర్థమయ్యే పదం. కాబట్టి నిజంగా భారతదేశంలో అన్ని భాషలూ ఒకటే అన్న నినాదం ఇవ్వాలనుకుంటే #HarBhashaEqual అని హిందీ డామినేషన్‌ తో ఇవ్వడం కాదు. #EveryLanguageEqual అని అని ఉంటే – ఎక్కువమంది రీచ్‌ అయ్యేది. మన భాష దేశం అంతా అర్థమైపోతుందనే హిందీ తాలూకు ఉత్తరాది అహంకారంతో చేయడం వల్లే – ఈ ట్యాగ్‌ చివరికి ఎవరికీ మనసుకి పట్టుకోకుండా – ఎందుకూ పనికి రాకుండా పోయింది.

ఇంగ్లిష్‌ వద్దట, హిందీయే ముద్దట!

వాస్తవానికి, ఈ ట్యాగ్‌ రూపకర్తలు, ఈ నినాదాన్ని మొదలుపెట్టిన ప్రచారకర్తల ఉద్దేశం ఏమిటంటే – ఇంగ్లిష్‌ రానివాళ్లు – తమకి ఇంగ్లిష్‌ రాలేదని బాధ పడకుండా ఉండాలనిట! ఈ ట్యాగ్‌తో వీళ్లు పెట్టిన వీడియోల్లో ఇదే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ వీడియోల్లో వీళ్లు చెప్పాలనుకున్నది ఒక్కటే! “బాబూ! మీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మీ కెరీర్‌లేమీ పాడవ్వవు, మన లోకల్ భాషల ద్వారా కూడా ఉద్యోగాలు వస్తాయి, ఇంగ్లిష్‌ నేర్చుకోకపోయినా పైకి వస్తాం – అని చెప్పాలన్నది ఈ వీడియోల ఉద్దేశం. అది మంచిదే! నిజానికి దీని వెనక ఉద్దేశం ఏమిటి? ఇంగ్లిష్‌ ని కాదని- హిందీని ప్రమోట్‌ చేసే ఉద్దేశం కాదా? ‘భారతీయ భాష అంటే కేవలం హిందీ మాత్రమే!’ అనుకునే సంకుచితులు ఈ యాడ్ ని తయారుచేశారా?  కేవలం హిందీ ఒక్కటే ప్రమోట్‌ చేస్తే బాగుండదు కాబట్టి – ఇంగ్లిష్‌ సమస్య ని బూచిగా చూపిస్తూ – ఈక్వాలిటీ అని యాడ్‌ చేశారా? – అనిపిస్తుంది. ఫైనల్‌ గా వీళ్లు చెప్పేదేంటి? “మీకు ఇంగ్లిష్‌ అక్కర్లేదు, మీరు ఇండియాలో ఏ భాష నేర్చుకున్నా అవకాశాలు బాగానే ఉంటాయి ” అని! అలా చెబుతూ – దానికి రుజువులుగా కొంతమందిని తీసుకువచ్చి ఒకరితో మలయాళం, మరొకరితో తమిళం, వేరొకరితో బెంగాలీ, మరొకాయనతో హిందీ – ఇలా భాషలు మాట్లాడించారు. అయితే ఇందులో కన్నడం లాంటి ముఖ్యమైన దక్షిణాది భాషల్ని వదిలేశారు. వాళ్ళందరూ ఈ వీడియోల కింద “మా భాష ఏది? మా కన్నడ ఏది?” అని గోల పెడుతున్నారు.

హిందీ రుద్దుతారట! మన భాషలు నేర్చుకోరట!


భాషా వివక్ష అన్నది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో నడుస్తూనే ఉంది. ఎంతో గొప్ప భాషలు, సంస్కృతులు ఉన్న దక్షిణ భారతదేశాన్ని – ఢిల్లీ రాజకీయాలతోనూ, హిందీ భాషా ప్రచార సభల పేరుతోనూ ఉత్తరాదివారు అణచివేయడం జరిగిందన్నది ద్రవిడ ఉద్యమాల్లో వినిపించిన మాట. లేదు, సమానత్వం ఉందీ అని అంటే – మన భాషలు ఉత్తరాదిన కూడా ప్రచారమై ఉండాలి. అయితే మన దక్షిణ భారతదేశ భాషలు ఉత్తరాదిన ఎప్పుడూ ప్రచారం కాలేదు. అక్కడి ప్రభుత్వాలు ఏనాడూ మన భాషల్ని భుజాన వేసుకుని ప్రచారం చెయ్యలేదు. కానీ హిందీని మాత్రం దక్షిణ రాష్ట్రాలమీద బలవంతంగా రుద్దడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది.


యూట్యూబ్ లో కొన్ని వీడియోల్లో ఇంగ్లిష్‌ ని నిరుత్సాహపరుస్తూ – భారతీయ భాషల్నే సపోర్ట్ చేయడం  కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఈ వీడియోలన్నీ భారతీయ భాష అంటే హిందీ మాత్రమే అన్నట్టుంటాయి. అదే బాధాకరం. #HarBhashaEqual ట్యాగ్ కూడా అలాంటి ఓ ప్రయత్నమే!  ఇంగ్లిష్‌ ని నిరుత్సాహపరిచి, భారతీయ భాష అన్న పేరుతో దక్షిణాది మీద హిందీ రుద్దడం వల్ల – ఎవరికి ఏం లాభమో, ఏం ఆనందమో తెలియదు. కానీ దశాబ్దాలుగా ఈ హిందీ రుద్దుడు వల్ల దక్షిణ రాష్ట్రాలకి జరిగిన నష్టం మాత్రం అంతా ఇంతా కాదు. ఉదాహరణకి – ప్రపంచంలో ఏ కొత్త సాఫ్ట్ వేర్ విడుదలైనా – అది రకరకాల భాషల్లో విడుదలవుతుంది. స్పెయిన్ కోసం స్పానిష్‌లో, జర్మనీ కోసం జర్మన్‌లో, జపాన్ కోసం జపనీస్‌లో ఇలా ఆయా దేశాలకు వాటి భాషలో వెర్షన్‌ విడుదలవుతుంది. కానీ భారతదేశం అనే సరికి ఒక్క హిందీయే! సాఫ్ట్‌వేర్ వచ్చీ రాగానే ముందు – ఇండియన్‌ వెర్షన్‌ పేరుతో కేవలం హిందీలో రిలీజ్ చేసి ఊరుకుంటారు. ఆ తర్వాత వారి దయ.  తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం లాంటి భాషల్లో వస్తాయా.. రావా.. అన్నది మన అదృష్టం మీద ఆధారపడాల్సిందే.

ఈ వివక్షకు కారణం విదేశాల తప్పు కాదు.. ఉద్దేశపూర్వకంగానో అనుద్దేశపూర్వకంగానో భారతదేశం అన్నది “ఒక హిందీ దేశం” అని ప్రపంచానికి  భ్రమ కల్పించినవారిదే – ఈ తప్పు! ఈ సంకుచిత భావనా ప్రచారం వల్ల – హిందీ కంటే గొప్ప సంస్కృతి, గొప్ప భాషా మూలాలున్న దక్షిణాది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం… అన్నిటినీ అణచివేతకీ నిర్లక్ష్యానికీ గురయ్యాయి. ఇక తుళు లాంటి భాషలకైతే దిక్కే లేదు. భారతదేశం అంటే హిందీ చాలు అనుకునే దుస్థితికి ప్రపంచాన్ని తెచ్చారు.  ప్రపంచం దృష్టిలో దక్షిణ భారతభాషల ఉనికినే చంపేశారు. హిందీ అతి ప్రచారం వల్ల దక్షిణాదికి జరిగిన ముఖ్యమైన కీడు ఇది!

ఉత్తరాది భాషలనూ గౌరవించని హిందీ

పోనీ ఈ హిందీ భాషాభూతం ఉత్తరాది భాషలనైనా గౌరవించిందా అంటే.. అదీ లేదు. బెంగాలీ, మరాఠీ లాంటి గొప్ప సంస్కృతులున్న భాషల్ని కూడా హిందీ ప్రచారభూతం అణిచేసింది. కానీ హిందీయేతర ఉత్తరాది వాళ్ళు కొంతవరకూ అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ల భాషలు ఆర్య భాషలు కనక కొంతవరకూ హిందీతో దగ్గరి పోలికలు కలిగి ఉంటాయి. అందువల్ల వాళ్ళకి హిందీ నేర్చుకోవడం గానీ, హిందీవాళ్ళతో కలవడం గానీ వాళ్లకి సులువవుతుంది. హిందీ వల్ల తమ భాషలు దెబ్బతింటున్న విషయాన్ని వాళ్లు గుర్తించరు. ఔదార్యం కంటే సౌకర్యమే ఇందుకు కారణం. కానీ దక్షిణ భారత భాషలు అలా కాదు. మన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు దేనికదే ఒక ప్రత్యేకమైన అస్తిత్వం, లోతు, అత్యంత ఘనమైన సాంస్కృతిక మూలాలు కలిగిన గొప్ప భాషలు. భారతదేశ భాషా వైభవానికి దక్షిణాదిన ఈ నాలుగూ నాలుగు గొప్ప సాంస్కృతిక మూల స్తంభాల్లాంటివి. వీటి పద్ధతి వేరు. లోతు వేరు. ఉదాహరణకు హిందీ వస్తే రాజస్థానీ పెద్దగా రాకపోయినా మేనేజ్ చెయ్యవచ్చు, అవి చాలా దగ్గరగా ఉంటాయి. హిందీ వస్తే పంజాబీని కాస్త ఇటూ అటూగా మేనేజ్ చెయ్యవచ్చు. కానీ తెలుగు,తమిళం, కన్నడం,మలయాళం అలా కాదు. దేనికదే ప్రత్యేకమైన అస్తిత్వం కలిగి ఉంటాయి. మరి ఇంత గొప్ప ప్రత్యేకతలు, విశిష్ఠతలు కలిగి ఉన్న భాషల్ని అసలు ఏ విధంగానూ సంబంధంలేని హిందీ భాషతో… జాతీయ భాష పేరుతో – నీరుగార్చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు?

“హర్ భాషా ఈక్వల్” అని చెప్పడం ఎలా ఉందంటే… బాగా తిని కడుపునిండిపోయిన వ్యక్తి ఒక బక్క ప్రాణికి డైటింగ్ పాఠాలు చెప్పినట్టుంది. హర్ భాషా ఈక్వల్ అనేది ఒక నంగనాచి నీతి సూత్రం అంటే తప్పేమిటి?. అన్ని భాషలూ ఒక్కటేనని పైకి మాత్రంఅంటే చాలా? అయినా స్వాతంత్రం వచ్చాక దశాబ్దాల తరబడి దక్షిణాది భాషలు  దెబ్బ తినేశాక – ఇప్పుడా ప్రకటన ఎందుకు?  ఎవరిని ఉద్ధరించాలని? అది కూడా ఇంగ్లీష్ కి వ్యతిరేకంగా వెళ్లమని వీళ్లు చెబుతున్నారు. ఏ భాష నేర్చుకున్నా ఒకటేనంటూ పైకి ముసుగు వేశారు గానీ, నిజానికి “హర్ భాషా ఈక్వల్” అనడంలోనే హిందీ డామినేషన్ ఉంది. కాబట్టి – ఈక్వాలిటీ పేరుతో కూడా హిందీని ప్రమోట్ చెయ్యడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇంగ్లిష్ శత్రువు కాదు .. హిందీయే కీడు చేసింది…

వాస్తవానికి దక్షిణ భారతీయులకి హిందీవల్ల జరిగిన కీడు కంటే ఇంగ్లీష్ వల్ల జరిగిన కీడు చాలా తక్కువ. నిజానికి ఎంతో మేలు చేసింది. నిజానికి ఇంగ్లిష్ అన్నది దక్షిణాది భాషల్ని ఎంతో కొంత కాపాడింది, దక్షిణాదివారు ఎదగడానికి ఇంగ్లిషే సాయపడింది. సి.పి. బ్రౌన్‌ లాంటి మహానుభావులు తెలుగు డిక్షనరీ రాసి భాషని కాపాడారు.

హిందీ అన్నది పూర్తిగా దక్షిణాదికి పరాయి భాష. వ్యాకరణంలో గానీ, పదాల్లో గానీ హిందీకి, దక్షిణాది భాషలకు పోలికలు చాలా చాలా తక్కువ. అయినా సరే దాన్ని బలవంతంగా దక్షిణాది మీద రుద్దే ప్రయత్నం దశాబ్దాల తరబడి జరుగుతోంది. కరుణానిధి లాంటి వ్యక్తులు కొందరు ఉండబట్టి కనీసం ఆ రుద్దుడు తీవ్రత కొంతైనా తగ్గిందని చెప్పవచ్చు. హిందీ డామినేషన్‌ని మొహమాటం లేకుండా ఒప్పేసుకునే హైదరాబాద్, బెంగళూరు లాంటి కొన్ని ప్రాంతాల్లో తప్ప – మిగిలిన చోట్లంతా “హిందీ మాకొద్దు బాబోయ్” అనేవాళ్లే ఎక్కువ!

నిజానికి దక్షిణాది చిన్నపిల్లలకి తమ మాతృభాషతో పాటు ఇంగ్లీష్ నేర్పిస్తే చాలు. అది ఇంటర్నేషనల్‌గా ఎక్కడైనా పనికి వస్తుంది. దానితో బాటు మళ్ళీ 3వ భాషగా హిందీని దక్షిణాది మీద రుద్దడమన్నది అత్యంత ఘోరమైన విషయం. ఎందుకంటే ఇక్కడి పిల్లలు చిన్నతనంలోనే మూడేసి భాషలతో ఇబ్బందులు పడాలి. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న విషయం. కానీ ఉత్తరాదిన? హిందీ పిల్లలకి మాత్రం వాళ్ల మాతృభాష హిందీ, మరో భాష ఇంగ్లిష్‌.. ఈ రెండూ చాలట. ! రెండు భాషలే కాబట్టి శ్రమ తక్కువ. అందుకే అక్కడి పిల్లలు విషయాలు తొందరగా నేర్చుకుని త్వరగా ఎదిగే అవకాశం దొరికింది. కానీ దక్షిణాది పిల్లల మీద మూడు భాషల శ్రమ మోపడం అన్నది కచ్చితంగా దురుద్దేశంతో జరిగిందని అంటే దానికి సమాధానమేమిటి?

ఎప్పుడైనా భారతదేశంలో చూస్తే, దక్షిణాది నుంచి ఎదిగినవాళ్ళు టాలెంట్‌తో ఎంత ఎదిగినా –  భాషవల్ల ఇబ్బందులు పడిన పరిస్థితులు చాలా కనిపిస్తాయి. ఎందుకంటే హిందీ అన్నది చిన్ననాటి ఉంచీ వాళ్లకి ఓ బర్డెన్‌ గా మారి, ఇంగ్లిష్‌ లో కూడా ఎదగకుండా చేయడమేనని చెప్పవచ్చు. నిజానికి ప్రచార సభలతో హిందీ ఎంత నేర్పినా – ఇప్పటికీ దక్షిణాదిలో చాలామందికి రాదు. హిందీ అనేది దక్షిణాది సంస్కృతికీ భాషా విధానానికీ చాలా దూరమైన భాష. పోనీ కష్టపడి దాన్ని నేర్చుకున్నా – నేర్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నా – అలాంటి దక్షిణాదివారిని గౌరవించే సంస్కారం ఉత్తరాదిన కనుమరుగవుతోంది. పార్లమెంటులో కూడా మనవాళ్ళు హిందీ మాట్లాడలేక అవమానపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. మనం ఎంతో గౌరవించే చిరంజీవిలాంటి వ్యక్తుల్ని – హిందీ సరిగ్గా మాట్లాడలేనందుకు – అక్కడ భాషపరంగా వేళాకోళం చెయ్యడం కూడా మనం చూశాం. ఇంత దారుణమైన స్థితిలో – అసలు మనం హిందీని మనం ఎందుకు ఆదరించాలనే ఆలోచన దక్షిణాదిలో ఏర్పడుతోంది రోజురోజుకీ ఈ ఆలోచన బలీయమవుతోంది. ఇది దేశ సమగ్రతకు మంచిది కాదు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ అసమానతల్ని సవరించక తప్పదు.

వారే దక్షిణాది భాషలు నేర్చుకోవచ్చుగా?

పరస్పరం భాషల్ని గౌరవించుకోవడం వేరు. వాళ్ళు మన భాషను గౌరవిస్తే, మనం వాళ్ళ భాషను గౌరవించడం సరయిన పద్ధతి. దక్షిణాదివాళ్ళు హిందీ నేర్చుకోవడం తప్పనిసరి అని ఉత్తరాది వాళ్లు ఏమాత్రం మొహమాటపడకుండా డిమాండ్‌ చేయడం మనం చూస్తాం. మాది జాతీయ భాష, మీవి విలువలేని భాషలు – కాబట్టి మీరు మా భాష నేర్చుకోండి అన్నట్టు ఉంటుంది వాళ్ల వాదం. కానీ అత్యవసరమై గడవదూ అనుకుంటే తప్ప – ఒక్క దక్షిణాది భాషను నేర్చుకోవడానికి కూడా ఎప్పుడూ హిందీవాళ్లు సిద్ధంగా ఉండరు. తమ భాష దేశమంతా చలామణి అవుతుందనే అహంకారమే దీనికి కారణం కావచ్చు. పైగా తెలంగాణ, బెంగళూరు లాంటి చోట్ల స్వీయభాష చచ్చిపోతున్నా – హిందీకి మొహమాటం లేకుండా సాదరస్వాగతం చెప్పడం … అవతలివాడు కనీసంగానైనా మన భాషని నేర్చుకోనవసరం లేకుండా – ముందు వీళ్లే ఎగబడి హిందీలో మాట్లాడేయడం – హిందీ అహంకారానికి మరింత ఆజ్యం పోసిందని చెప్పవచ్చు. ఈ అహంకారానికి తిలోదకాలు ఇవ్వాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమయింది.

ఇంతవరకూ హిందీ డామినేషన్ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందిన ఉత్తరాది – ఇప్పుడు హఠాత్తుగా  “హర్ భాషా ఈక్వల్” అంటూ నంగనాచిగా నీతి సూత్రం చెబితే – నమ్మడానికి దక్షిణాదిలో ఎవరైనా సిద్ధంగా ఉంటారా? అసలు దక్షిణాది నుంచి వచ్చిన ఆదాయాన్ని ఉత్తరాదిలోని వెనుకబడిన రాష్ట్రాలకి పంచిపెడుతూ … కేంద్రం  వివక్ష ప్రదర్శిస్తోందని జాతీయ మీడియాలోనే ఎన్నో ప్రోగ్రాములు వచ్చాయి. ఆ తేడా తాలూకు గణాంకాలు నిన్న మొన్న కూడా టీవీల్లో చూస్తూనే ఉన్నాం. దక్షిణాదిని దోచి ఉత్తరాదికి పెడుతున్నారంటూ టీవీ డిస్కషన్లు కూడా ఎన్నో జరిగాయి. ఈ అసమానతలకి తోడు భాషాపరమైన అవమానాలు కూడా దక్షిణాది సహించాలా?

అన్ని భాషలూ సమానమే అని చెప్పే ట్యాగ్‌లో కూడా – అసంకల్పితంగా – చాలా క్యాజువల్గా  హిందీ పదాన్నే మొట్టమొదట వాడేయడం –  భాషా అసమానత ఎంతగా జీర్ణించుకుపోయింది అన్నదానికి పరాకాష్ఠ. ఉత్సాహపరచలేని ఈ ట్యాగ్‌నీ, ఈ ఉత్తుత్తి సమానత్వ ఉద్యమాన్నీ ఎవరు ప్రారంభించారో – వారు వెంటనే ఈ నిజాన్ని తెలుసుకుని ఈ ప్రచారానికి అంతం పలకడం చాలా అవసరం. లేకపోతే కచ్చితంగా ఇది దక్షిణాది భాషల్ని మరింత కించపరచడమే అవుతుంది.

ఇండియా అంటే నార్త్ ఇండియా మాత్రమేనా?

ఇండియావేరు, సౌత్ ఇండియా వేరనే భావం – కేవలం ఉత్తరాదివాళ్ళు కల్పించిందే. వాళ్ళు ఇండియా గురించి మాట్లాడేటప్పుడు – దక్షిణాదిని లెక్కే చేయరు. హిందీ వాళ్ళ గురించే పరిగణనలోకి తీసుకుని మాట్లాడతారు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

ఎయిర్‌టెల్, డిజిటల్ టీవీ లాంటి డీటీహెచ్ సర్వీసుల్లో కూడా హిందీ భాషకు చెందిన చానెల్స్ ని ప్రత్యేకంగా ఎలివేట్ చేస్తూ, దక్షిణాది భాషల్ని మాత్రం ఒక కట్ట కట్టి.. అవి అంత ముఖ్యమైనవి కాదన్నట్టు ‘రీజనల్ ఛానెల్స్’ అని ఒక మూలన పడేస్తున్నాయి. ఇలాంటి వివక్షల గురించి చెప్పుకుంటూ పోతే – వేల కొద్దీ ఉన్నాయి. అలాగే ఒక ఉత్తరాది హిందీ వ్యక్తి ఎవరికైనా కాల్ చేసేటప్పుడు మొట్టమొదట హిందీలో మాట్లాడతాడు. అతను కేరళకి కాల్ చేసినా, తెలుగు రాష్ట్రాలకి కాల్ చేసినా, తమిళనాడుకి కాల్ చేసినా, కర్ణాటకకు కాల్ చేసినా సాధారణంగా మొట్టమొదటి మాట హిందీలోనే మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే, భారతదేశంలోని ప్రతివాడికీ హిందీవచ్చునన్న భ్రమ… వచ్చి తీరాలన్న అహంకారం. ఈ అహంభావం, భ్రమ ల వల్లే – హిందీ తప్ప మరో భారతీయ భాష నేర్చుకోరు. అయ్యో మనం ఫలానా రాష్ట్రం వారితో మాట్లాడుతున్నాం… అక్కడ లోకల్ భాష వేరే ఉంటుందేమో.. హిందీ అర్థం కాదేమో.. కనీసం ఇంగ్లీషులో మాట్లాడదాం… అదైతే వారికి సులువుగా అర్థమవుతుందేమో.. అనీ కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని రీతిలో ఉత్తరాదివారు కాల్స్ చేస్తుంటారు. ఇది దక్షిణాదిని తీవ్రంగా అవమానపరచడమే. ఇలాంటి కారణాలు, వివక్షలన్నిటినీ జాబితా చేస్తూ పోతే వాటికి అంతే ఉండదు.

చిరంజీవి, రజనీకాంత్ లు ఇండియన్ సూపర్ స్టార్లు కారా?

ఒక అమితాబ్, షారుఖ్ ఖాన్ గురించి చెప్పేటప్పుడు ‘ఇండియన్ సూపర్ స్టార్’ అంటున్నారు. ఒక రజనీకాంత్‌, ఒక చిరంజీవి, ఒక మమ్ముట్టి గురించి చెప్పేటప్పుడు – ‘సౌతిండియన్ సూపర్ స్టార్’ అంటున్నారు. అంటే సౌత్‌ ఇండియా ఇండియా కాదా? ఇదేమయినా కంట్రీలో మరో కంట్రీయా? సెకండరీ స్థాయి ఉన్న వేరే దేశమా? మీడియా వారు కూడా ఇలాంటివి సరిచేసుకోవాలి.

మొత్తం మీద చూస్తే “హర్ భాషా ఈక్వల్” … అన్నది ఒక అర్థరహితమైన సమానత్వ ప్రదర్శన! ఆదర్శం రూపంలో కనిపిస్తున్న అసమానత!  భాషాపరమైన అవమానాలూ అసమానతలూ ఎదుర్కుంటున్నప్పటికీ – దక్షిణాదివారు ఎప్పుడూ భారతీయతనూ, భారతదేశ సమగ్రతనూ గౌరవిస్తారు. తమ భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నా.. హిందీ అతి ప్రచారం కారణంగా తమ భాషా సంస్కృతులు దెబ్బ తింటున్నా  – వాళ్ళు నిజమైన దేశప్రేమ కలిగి – అన్నీ సహిస్తున్నారు. కానీ వారి హృదయావేదనను ప్రభుత్వాలు గుర్తించాలి. చట్టాలతోనైనా భాషా సమానత్వాన్ని సాధించాలి. భారతీయ సమగ్రతను మరింత పటిష్ఠం చేయాలి. జై భారతమాత!

చదివారు కదా? చదివి ఊరుకోకండి. ఈ లింక్ ను నలుగురికీ పంపండి! తెలుగువారి ఆత్మగౌరవాన్నీ, దక్షిణాది ఆవేదననీ అందరికీ తెలియజెప్పండి!

ఇది కూడా చదవండి!

తమ భాషని గౌరవించమని కోరడం ప్రజాస్వామ్యం కాదా?

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu