తొలి ఆంధ్రా ఛానెల్‌ ఇదేనట!

F2 Movie

ఒక రాష్ట్రం ఆవిర్భవించిందంటే దానితో పాటే అనేక మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మీడియా సంస్థలు పుట్టుకొస్తాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడగానే తెలంగాణ కోసమే పని చేసే కొన్ని ఛానెల్స్ ఊపందుకోవడం మనం గమనించాం. అయితే ఇప్పటికీ ఆంధ్రాలో రాజధాని పరంగా నివాసయోగ్యమైన పరిస్థితులు లేకపోవడం వల్ల – హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్లేవాళ్ళు పరిమితంగానే ఉన్నారు. అయితే రాబోయే రెండు లేదా మూడేళ్ళలో హైదరాబాద్ నుండి అమరావతికి తరలి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువవుతుందనడంలో సందేహమే లేదు. ఒక్కసారి పరిపాలన, రాజకీయం ఊపందుకుందంటే ఇక మీడియా పనికి లోటుండదు. అందువల్ల ఇప్పటివరకు అమరావతినీ , ఆంధ్రా రాజకీయాల్నీ కాస్త నిర్లక్ష్యం చేస్తూ, తక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న ఛానెల్స్‌ ఇప్పుడిప్పుడే అటువైపు గట్టిగా దృష్టి పెడుతున్నాయి. తెలంగాణ కోసమే కొన్ని తెలంగాణ ఛానెల్స్‌ ఏర్పడినట్టు – ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్‌ కోసమే కొన్ని కొత్త చానల్స్ ఏర్పడుతున్నాయి. అలాంటి ఒక ఛానల్ తాజాగా ప్రకటనలు గుప్పిస్తోంది. యూట్యూబ్‌లో తమ యాంకర్లతో న్యూస్‌ ప్రెజెంటర్లతో వింత వింత విన్యాసాలు చేయిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తోంది. ఏపీ 24/7 అనే ఈ ఛానల్ వివిధ రాజకీయ ప్రముఖుల్ని పిలిచి ప్రారంభోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంది.
ఒక కొత్త ఛానెల్‌ పెట్టినప్పుడు అన్ని రాజకీయ పక్షాల్నీ ఆహ్వానించడం మామూలు. మీడియా పిలిచినప్పుడు లీడర్లు కూడా కాదనకుండా రావడం మామూలు. ఏపీ 24/7 అనే ఈ ఛానల్‌ ప్రారంభోత్సవానికి పాలకపక్షం నుంచి చంద్రబాబునీ, ప్రతిపక్షంనుంచి బొత్సానీ, కాంగ్రెస్‌నుంచి రఘువీరానీ ఆహ్వానించడం విశేషం. మరి జగన్‌ని ఆహ్వానించలేదా? ప్రతిపక్ష నాయకుణ్ణి ఆహ్వానించకపోవడం ఉండదు. అయితే మరి – ఆహ్వానించినా జగన్‌ రాలేదా? ఎందుకు రాలేదు? పాదయాత్ర వల్ల రాలేదా? ఈ ఛానెల్‌ రూపు రేఖలు పాలక పక్షానికే కొమ్ముకాసేలా ఆయనకి అనిపించడం వల్ల రాలేదా? – ఏపీ 24/7 ఆహ్వానపత్రిక చూసినవారికి ఇలాంటి సందేహాలు రావడం సహజం. ఏదేమయినా తొలి ఆంధ్రా ఛానల్ గా ఫోకస్‌ చేసుకుంటూ ఆంధ్రా లో నిలదొక్కుకోవడానికి ఈ ఛానెల్‌ ప్రయత్నిస్తోంది. ఇక జనరల్‌ ఎలక్షన్లకి ఏడాది పైన కొద్దికాలం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆంధ్రాలో ఇదే బాటలో మరిన్ని చానల్స్ కూడా రాబోతున్నాయి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu