తమ భాషని గౌరవించమని కోరడం ప్రజాస్వామ్యం కాదా?

F2 Movie

హర్‌భాషాఈక్వల్‌ (#HarBhashaEqual )అంటూ – డెయిలీహంట్‌ వాళ్లు తీసుకొచ్చిన భాషా(అ)సమానత ట్యాగ్‌ గురించి తెలుగువాడు.కామ్‌ రాసిన ఆర్టికల్‌ సంచలనం సృష్టిస్తోంది. ‘దక్షిణ భారతదేశానికి భాషా స్వతంత్రం ఉందా? ‘ అంటూ రాసిన ఈ ఆర్టికల్‌ భాషాభిమానుల ఆందోళనకు అద్దంపట్టింది. అయితే ఈ ఆర్టికల్‌ లో ఆవేశం పాలు ఎక్కువయిందని కొందరు నెటిజన్లు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే నిజానికి – పరిశీలించి చూస్తే – ఈ ఆర్టికల్‌ లో ఎక్కడా తప్పుడు మాట గానీ, భారతదేశం పట్లా రాజ్యాంగం పట్లా అనుచిత వ్యాఖ్యలు గానీ లేవని సులువుగా అర్థమవుతుంది. అసమానతల్ని పోగొట్టమని కోరడం ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లేలా చేయడం కోసమేనని విమర్శకులు గుర్తించాలి. దేశంలోని అన్ని భాషలతో సమానంగా తమ భాషను కూడా గౌరవించమని కోరడం ప్రజాస్వామ్యమే అవుతుంది తప్ప – అదేమీ తప్పూ కాదు, నేరమూ కాదు.

ఇక పోతే – దక్షిణాది ఆదాయాన్ని ఉత్తరాదికి ఖర్చుపెడుతున్నారన్న మాటలు మావి కావు. అవి మీడియాలో ప్రముఖంగా వచ్చినవే. పెద్ద పెద్ద నేషనల్‌ ఛానెల్సే – ఈ వివక్షగురించి ప్రోగ్రాములు ఇచ్చాయి. అవి విమర్శించినప్పుడు లేని తప్పు – వాటిని కేవలం ఉటంకించినప్పుడు – తప్పెలా అవుతుంది?

అయితే విషయాలు చెప్పేటప్పుడు కనిపించిన ఆవేశం నిజానికి అసమానత పట్ల ఆందోళన మాత్రమే అని గుర్తించాలి. భారతదేశంలోని ఏ భాషకీ ఇక్కడ వ్యతిరేకులు లేరు. కానీ ఒక భాషని అందలమెక్కించే ప్రయత్నంలో ఇతర భాషల ప్రయోజనాలు దెబ్బతింటే తప్పకుండా ప్రశ్నించి తీరాలి. ప్రజాస్వామ్యం అంటే అదే! తెలుగువాడు.కామ్‌ అదే చేయడం జరిగింది.

దక్షిణాదిపై హిందీ రుద్దడాన్ని ఆపితే తప్పేమిటి? స్వాతంత్ర్యం వచ్చిననాటినుంచీ చేస్తున్నది అదే కదా? పోనీ దక్షిణాదిలో హిందీని తప్పనిసరి చేసినట్టే – ఇప్పుడైనా ఉత్తరాదివారికి కనీసం ఒకటిరెండు దక్షిణాది భాషల్ని తప్పనిసరి చేస్తే తప్పేమిటి? ఆ విధంగా అసమానతల్ని రూపుమాపకూడదా? అందరూ ఒకటే అని చాటి చెప్పకూడదా? #HarBhashaEqual అని చెబుతూ హిందీకి ప్రాధాన్యం ఇవ్వడం పట్లే మా ఆక్షేపణ. లౌకిక రాజ్యాంగం అని చెబుతూ ఇది ఒక హిందూ దేశం అని చెప్పడం తప్పయితే – అన్ని భాషలూ సమానం అని చెబుతూ ఇది ఒక హిందీ దేశం అన్నట్టు ప్రవర్తించడం కూడా తప్పే! ఇంతకాలం దక్షిణాదిలో హిందీ ప్రచార సభలు నడిపారు. మరి ఉత్తరాది జనంలో ముఖ్యంగా హిందీ మాట్లాడేవారిలో ఇతర భాషల పట్ల గౌరవం పెంచగలిగే చర్యలు ఎందుకు తీసుకోకూడదు? దక్షిణ భారతదేశం లో వ్యాపారం చేసే డీటీహెచ్‌ లూ ఫోన్‌ ప్రొవైడర్లూ ఎంటర్‌ టైన్‌మెంట్‌ కంపెనీలూ – హిందీ కంటే తప్పనిసరిగా దక్షిణాది భాషలకి ప్రాధాన్యం ఇచ్చి తీరాలన్న నిబంధనలు పెడితే తప్పేమిటి? అలాంటి చర్యలు  కేంద్రం తీసుకోగలిగితే – ఈ భాషా అసమానతల సమస్య కొంతకాలానికైనా తగ్గుముఖం పడుతుంది. ఆ విధంగా కేంద్రం ముందడుగు వేయాలని తెలుగువాడు.కామ్‌ ఆశిస్తోంది.

చివరిగా ఒక్కమాట! తెలుగువాడు.కామ్‌ అన్నది ప్రాంతీయవిద్వేషం భాషా ఫెనటిజం లాంటి సంకుచిత భావాలు కలిగిన సైట్‌ కాదు. అఖండ భారతావనిలో – ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయంగా అందరి క్షేమం కోరుకునే అత్యంత ఉదారమైన భావాలు కలిగిన సైట్‌. ఉత్తరాది దక్షిణాది చర్చలు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో – భాషాపరమైన, సాంస్కృతికమైన ఈ అసమానతలు అఖండభారతావని సమగ్రతకి కీడు తేకూడదనే ఉద్దేశంతో – ముందు జాగ్రత్తగా తప్పుల్ని స్పష్టంగా ఎత్తి చూపే ప్రయత్నమే ఇది! ప్రజాస్వామ్యంలో విచక్షణతో విమర్శించడం పాత్రికేయుల విధి! తప్పుల్ని సరిచేసుకోవడం విమర్శితుల విధి! తప్పుల్ని ఎంచడమే తప్పు – అని ఎవరైనా అంటే – ఇక అది ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుందని అందరూ గుర్తించాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu