తప్పిపోయిన అమ్మాయి కోసం ఒక వెబ్ సైట్!

F2 Movie

తప్పిపోయిన వారికోసం ఎడ్వర్టయిజ్‌మెంట్‌ ఇస్తారు. పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తారు. అలాగే తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేసే వెబ్‌ సైట్లు కూడా ఉన్నాయి. అయితే – తప్పిపోయిన కేవలం ఒక్క అమ్మాయి కోసం వెబ్‌ సైట్‌ క్రియేట్‌ చేయడం అన్నది అమెరికాలో ఇటీవల జరిగింది.
అమెరికాలో లోవా యూనివర్సిటీకి చెందిన ‘మోలీ టిబ్బెట్స్’ అనే 20 ఏళ్ళ అమ్మాయి కనిపించకుండా పోయింది. జులై 18 నుంచీ ఆమె కనిపించడంలేదు. లోవాలోని సొంత ఊరు బ్రుక్లిన్‌లో ఆమె జాగింగ్ చేస్తూ చివరిగా కనిపించింది. ఆ తరవాత కనబడలేదు, ఏమైందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు లోవాకి చెందిన నేరపరిశోధన విభాగం వారు ఆ అమ్మాయిని కనిపెట్టడానికి ఏకంగా ఒక వెబ్ సైట్ నే ప్రారంభించారు. https://findingmollie.iowa.gov/ అన్నది ఈ వెబ్ సైట్ అడ్రస్.

సమస్య ఏంటంటే – ఈ మిస్సింగ్‌ కేసులో పెద్దగా ఆధారాలు ఏమీ లేవు. అందువల్ల అక్కడి నేర పరిశోధన విభాగం వాళ్లు – ముందు సీసీ కెమెరాల మీద ఆధారపడ్డారు. తరవాత ఆ వీడియోలో కనిపించిన వ్యక్తుల మీద నిఘా పెట్టి అసలు వ్యక్తి ఎవరై ఉంటారో కనిపెట్టడానికి ఓ వినూత్నమైన మార్గంలో ముందరికి వెళ్తున్నారు. మోలీ తప్పిపోయిన రోజు జులై 18వ తేదీ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఆ ప్రాంతంలో – ఎవరైనా ఏవైనా అనుమాస్పదమైన పనులు చేసిన విషయం ఎవరైనా గుర్తించి ఉంటే , గమనించి ఉంటే ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేయమని వారు కోరారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు బయటకు రాకుండా ఏర్పాట్లు చేశారు.
ఎంత పకడ్బందీగా వీరు సమాచారం సేకరిస్తున్నారో మనకి తెలిస్తే, వారి నేరపరిశోధన ఎంత గొప్పగా సాగుతోందన్నది మనకు అర్థమవుతుంది. ఉదా.కి ఆ వీడియోలో కనిపించిన వ్యక్తుల్లో నేరస్తుడు ఉండవచ్చు. అతనెవరో కనిపెట్టడం కోసం అందరినీ అనుమానించక తప్పదు. ఎవరెవర్ని అనుమానిస్తారంటే –

ఎవరైనా – నేరం జరిగిన రోజున సాధారణ, రొటీన్ విషయాలకంటే భిన్నంగా ఏదైనా చేసి ఉంటే, ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే, వారు స్కూల్ లేదా ఉద్యోగం మానేయడం, ఆ రోజున సెలవు పెట్టడం లాంటివి చేసి ఉండి, కచ్చితమైన వివరాలు ఇవ్వలేకపోతే వారిని అనుమానించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో కనిపించిన వారెవరైనా ఒక వాహనాన్ని రిపేర్ షాపుకు తీసుకువెళ్ళడం, అమ్మడం, డిస్పర్స్‌ చేయడం… లాంటివి చేసినా వాళ్ళను అనుమానించడం జరుగుతుంది. అలాగే హఠాత్తుగా వాహనాన్ని శుభ్రపరచడం గానీ, అది కూడా సాధారణంగా వాహనాలు శుభ్రపరిచే పగటి సమయంలో కాకుండా ఎప్పుడో రాత్రి వేళలో ఈ పని చేసినా గానీ – వారిని అనుమానించడం జరుగుతుంది. అలాగే జులై 18 సాయంత్రం నుంచి జులై 19 పగలు వరకూ – ఫోన్‌లో లేదా మరోలా గానీ అందుబాటులో లేని వ్యక్తులను కూడా అనుమానించడం జరుగుతోంది. అలాగే ఎవరైనా గడ్డం తీసేయడం, హెయిర్ కట్ మార్చుకోవడం లాంటి చర్యల ద్వారా తమ రూపాన్ని మార్చుకునే పనులు చేసినా అనుమానితులే! అలాగే వీరిలో ఎవరైనా అతిగా టెన్షన్‌, ఉద్వేగం ఫీలవుతుంటే వాళ్ళను కూడా అనుమానించడం జరుగుతుంది. అలాగే, వారిలో ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే… దానికి సరైన కారణాన్ని చెప్పలేకపోతేఅనుమానించడం జరుగుతుంది. అలాగే ఆ తేదీల మధ్య ఆల్కహాల్, డ్రగ్స్, సిగరెట్స్ అతిగా తీసుకున్నా అనుమానించడం జరుగుతుంది. నిద్రపోయే విషయంలో కూడా సరిగ్గా లేకుండా, అస్థిరంగా ఉన్నవాళ్ళను కూడా అనుమానించడం జరుగుతుంది. అలాగే ఈ దర్యాప్తు ఎలా సాగుతుందోనని ఆసక్తి చూపించినవారిని కూడా అనుమానించడం జరుగుతుంది. అంతే కాదు, మిస్సయిన అమ్మాయి మోలీ టిబ్బెట్స్‌ గురించి మీడియాలో ఏమి వస్తుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేవాళ్లను కూడా అనుమానించడం జరుగుతుంది.

ఆ రోజున అక్కడ దొరికిన వీడియోలో ఉన్న అందరి అడ్రసులూ కనుక్కుని, వాళ్ళు పైన పేర్కొన్న స్థితుల్లో ఎందులోనైనా ఉంటే, పై పాయింట్స్‌లో దేనితో సరిపోలినా సరే వాళ్ళను అనుమానిస్తారు. నేరస్తులెవరో పట్టుకోవడం కోసం ఇంత లోతైన పరిశోధన వాళ్ళు చేస్తున్నారు. నిజంగా మోలీ టిబ్బెట్స్ దొరకాలని, క్షేమంగా ఇంటికి రావాలని మనం కూడా కోరుకుందాం. వాళ్ళ కృషి ఫలించాలని కోరుకుందాం. మోలీ టిబ్బెట్స్‌ దొరికిందా అని మళ్లీ వెతక్కండి. మిమ్మల్ని కూడా అనుమానిస్తారేమో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu