ఠాగూర్‌కీ భారతీయుడికీ కూడా శిక్ష తప్పదు!

SriRamaNavami

లంచం తీసుకునేవాళ్ళకే కాదు, ఇచ్చేవాళ్ళకు కూడా కఠినమైన శిక్ష పడుతుందని చెప్పే అవినీతి నిరోధక బిల్లుకి లోక్‌సభలో ఇప్పుడు ఆమోదముద్ర పడింది. అయితే లంచం ఇచ్చినవాళ్ళకి కూడా శిక్షవేయడం కరెక్టా?కాదా? అంటే, అది చర్చనీయమైన అంశం. అవినీతి అనేది చేతులతో కొట్టే చప్పట్ల లాంటిదని కొందరంటారు. ఇచ్చేవాళ్ళు ప్రోత్సహించకపోతే – తీసుకునేవాడు ఎలా తీసుకుంటాడనేది ఒక కోణమైతే… ఇవ్వకపోతే పని చెయ్యనని డిమాండ్‌ చేయడం అనేది మరో కోణం.

అధికారి వైపు అవినీతి ఉన్నప్పుడు … తప్పనిసరై తన పని అవ్వడం కోసం ఒకడు లంచం ఇవ్వడం జరిగి ఉండవచ్చు. కొన్నిసార్లు వేరే రకంగా ఉంటుంది. అధికారిలో లంచం తీసుకోవాలనే కోరిక లేకపోయినప్పటికీ, లంచం ఇవ్వదలచిన వ్యక్తి ఆ అధికారిని లంచం తీసుకోవడానికి ప్రోత్సహించి – తన పని అయ్యేలా చేసుకుని ఉండవచ్చు. లంచం విషయంలో శిక్షలు వేసే ముందు – పై రెండిటిలో అక్కడ ఏ రకం అవినీతి జరిగిందనేది తెలుసుకోవడం ముఖ్యం. అది తెలుసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు? సాధారణంగా తీసుకున్నవాడూ ఇచ్చినవాడూ తప్ప మరెవరూ సాక్ష్యం ఉండని సందర్భాల్లో అవినీతి ఎటు ఉందని కనుక్కోవడానికి ఏదైనా పద్ధతులు కనిపెట్టారా? అసలు ఉన్నాయా? ఇవన్నీ లేకుండా – కేవలం చర్యలు తీసుకోవడం, శిక్షలు వేయడం అన్నది కరెక్ట్‌ కాదు. ఎందుకంటే … నీతిపరులకి కూడా శిక్షపడే ప్రమాదముంది.

ఉదాహరణకి ఒక అధికారి నిజాయితీగా ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చి తప్పనిసరిగా తనకో పని కావాలని చెబుతాడు. బలవంతపెట్టో… ప్రలోభపెట్టో డబ్బు ఇస్తాడు. కానీ అధికారి ముందు తీసుకోను అంటాడు. కానీ సాధారణంగా ఏం జరుగుతుందంటే – ఒక క్లయింట్‌ వచ్చి అధికారిని డబ్బు చూపి ప్రలోభపెట్టినప్పుడు.. ఇది కేవలం ఏదో డబ్బు వ్యవహారం అనే కోణంలో మాట్లాడడు. ఆ ఫలానా పని జరగడం తనకి చాలా అవసరమంటూ జాలికలిగే రీతిలో మాట్లాడే పరిస్థితులుంటాయి. ఎన్నో కారణాలు చెప్పి మానవీయ కోణాలు తీసి – ఎలాగైనా మీరే చేసిపెట్టాలి. మీరు తప్ప మరో దిక్కు లేదంటాడు. అప్పుడు ఆ అధికారికి లంచం తీసుకోవడం ఇష్టం లేకపోయినా, “అయ్యో.. పాపం ఇది ఇతనికి చాలా అవసరంలా ఉంది” అని భావించి ఆ పని చేసిపెట్టవచ్చు. ఆ తరవాత, పనయిపోయాక కొంతకాలానికి ఈ కేసు విషయం బయటపడిందనుకోండి! కేసు పెద్దదై, ఇరుక్కునే పరిస్థితి వచ్చిందనుకోండి. … లంచం ఇచ్చిన వ్యక్తి అధికారిపైనే నెపం పెట్టే అవకాశం ఉంది. ఆ అధికారే తనను బలవంతపెట్టి లంచం తీసుకున్నాడని అతను అంటే… దాన్ని కాదనడానికి ఏ రుజువూ దొరికే అవకాశం లేదు. అలాంటప్పుడు నిజాయితీపరుడైన అధికారి అవినీతిపరుడిగా… ప్రలోభపెట్టిన వ్యక్తి నీతిమంతుడిగా చలామణీ అయ్యే అవకాశముంది.

పై కేసుల్లాంటివి చూసినప్పుడు – ‘ఇప్పుడు “లంచం ఇచ్చినవారు కూడా శిక్షార్హులే” అనడం కరెక్టే!’ అనిపిస్తుంది. అయితే, అవినీతి కేసుల్లో విచారణ జరిగినప్పుడు – గతంలో లంచమిచ్చినవారికి ఏదో ఒక రక్షణ ఉండేది. తప్పనిసరై ఇచ్చారనో.. లేదా అత్యవసరమైన పరిస్థితుల్లో అలా చేశారనో.. వాళ్లకి శిక్షల నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొత్త పద్ధతి అమలైతే – మేం ఫలానా వ్యక్తికి లంచం ఇచ్చాం అని బయట చెప్పుకునే పరిస్థితి ఉండదు – చెబితే వీళ్ళు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి! కాబట్టి ఈ పద్ధతిలో వెళ్తే – కొందరు అవినీతి అధికారులు లంచం తీసుకుని కూడా ఎప్పటికీ బయటపడకుండా దర్జాగా గడిపే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి?

లంచాల కేసుల్లో పరిశోధన జరగాల్సిన ప్రధానమైన విషయం ఒకటే! ఇచ్చినవాడు, పుచ్చుకున్నవాడు – ఎవరికి ఏ ఉద్దేశం ఉంది? ఇంటెన్షన్‌ ఏంటి? – అన్నది కనుక్కోవాలి. లంచం ఇచ్చే ప్రక్రియ, లేదా తీసుకునే ప్రక్రియ ఎలా జరిగింది? ఎవరి ప్రోద్బలంతో జరిగింది, ఎవరు ఇవ్వడానికి ఇంట్రస్ట్ చూపారు, ఎవరు అవసరంలో ఉన్నారు? ఎవరైనా బలవంతపెట్టారా? ఇద్దరికీ ఇష్టమై జరిగిందా? – అనే కోణాల్లో సరిగ్గా పరిశోధన జరగాలి. ప్రభుత్వ అధికారులను ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చెయ్యకూడదని, కేసు పెట్టకూడదని కూడా రూల్‌ పెట్టారు కాబట్టి… ముందుగా కేసు గురించి లోతుగా అధ్యయనం చేసి అప్పుడు ముందుకి వెళ్లాలి. లేకపోతే ఈ కొత్త లంచం బిల్లు పుణ్యమా అని… తప్పును ఒప్పుగాను, ఒప్పును తప్పుగానూ చూపినవాళ్ళమవుతాం. ఠాగూర్‌ సినిమాలో ఆసుపత్రి వాళ్ల మోసం కనిపెట్టడం కోసం – శవానికి వైద్యం చేయిస్తూ ఎంతో డబ్బు ఇస్తాడు హీరో. మరి అది కూడా తప్పే కదా? – అని కొందరు అనచ్చు. కాబట్టి ఉద్దేశాలు కనుక్కోకుండా శిక్షలు వేస్తే – ఈ కొత్త రూల్స్‌ వచ్చాక ఠాగూర్‌ కీ భారతీయుడికీ కూడా శిక్ష పడే ప్రమాదం ఉందేమో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu