జావా… ఫైర్‌ఫాక్స్‌ గుడ్‌బై… గుడ్‌బై!

F2 Movie

ఇంటర్‌నెట్లో ఎన్నో దశాబ్దాలుగా జావా ప్లగిన్‌కి ఫైర్‌ఫాక్స్‌తో అనుబంధం ఉంది. ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు ఇంటరాక్టివ్‌ అవసరాల కోసం జావాని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ 57 వచ్చిన తరవాత జావా ప్లగిన్‌కి కూడా ఫైర్‌ఫాక్స్‌ పూర్తిగా బై చెప్పేసింది. అయితే పెద్ద నష్టమేం లేదు. ఒకప్పుడు జావా ప్లగిన్‌ ఉంటే తప్ప చేయలేని పనులెన్నోఇప్పుడు అది లేకుండానే ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్లో చేసుకోవచ్చు. ఇది అభివృద్ధికి చిహ్నమే అయినప్పటికీ – ప్లగిన్స్‌తో బ్రౌజర్స్‌కి ఉన్న దశాబ్దాల అనుబంధం గురించి తెలిసిన టెక్‌ జనాలకి – ఆ అనుబంధం బీటలువారే ఈ పరిణామాలు ఓ డీప్‌ ఫీలింగ్‌ కలిగించడం సహజం.

ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ ని ప్రపంచంలో కోట్లమంది నెటిజన్లు వాడుతుంటారు. ఒకప్పటి నెట్‌స్కేప్‌ బ్రౌజరే తరవాత ఫైర్‌ఫాక్స్‌గా అవతరించింది. దీంట్లో ఎన్నో గొప్ప ఫీచర్లున్నప్పటికీ – కొన్ని ప్రత్యేకమైన ఎడ్వాన్స్‌డ్‌ అవసరాల కోసం దీనికి ప్లగ్‌-ఇన్స్‌ జతచేయడం జరుగుతోంది. ఉదాహరణకి వీడియోలు స్ట్రీమ్‌ చేయడానికి ఫ్లాష్‌ ప్లేయర్, సిల్వర్‌లైట్‌ లాంటి ప్లగిన్స్‌, ఇంకా ఇంటరాక్టివ్‌ అవసరాల కోసం జావా లాంటి ప్లగిన్స్‌ ఫైర్‌ఫాక్స్‌తో కలిపి పనిచేయడం ఎప్పటినుంచో ఉంది. వీటిని ఎన్‌పీఏపీఐ ప్లగిన్స్‌ అంటారు. అంటే నెట్‌స్కేప్‌ ప్లగిన్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ Netscape Plugin Application Programming Interface (NPAPI)ప్లగిన్స్‌.

అయితే ఇప్పుడు వెబ్‌ టెక్నాలజీ బాగా ఎదిగింది. ఇంటర్‌నెట్‌ బ్రౌజర్స్‌ శక్తిమంతంగా మారాయి. గతంలో ఫ్లాష్‌ప్లేయర్‌ లేకుండా యూట్యూబ్‌ వీడియోలు చూడగలిగేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు ఫ్లాష్‌ప్లేయర్‌ లేకుండానే html5 సాయంతో యూట్యూబ్‌ వీడియోలు మనం చూడగలుగుతున్నాం అంటే – ఈ అభివృద్ధే కారణం.

అసలు బ్రౌజర్‌కి అదనంగా ప్లగిన్సూ, యాడాన్సూ కలపడం మంచి పద్ధతి కాదన్నది ఎప్పటినుంచో ఉన్న ఆలోచన. ఎందుకంటే ఇవి బ్రౌజర్‌ పనితీరు మీద ప్రభావం చూపిస్తాయి. పైగా సెక్యూరిటీ సమస్యలు తెస్తాయి. అలాగని ప్లగిన్సూ యాడాన్సూ లేకుండా పూర్తిగా మానేసి, సకల సౌకర్యాలూ బ్రౌజర్లోనే పెట్టేయలేం. ప్రత్యేక అవసరాలకోసం ప్లగిన్స్‌ తప్పనిసరి. అయితే అది యూజర్‌ ఇష్టం మీద ఆధారపడి ఉండాలి. అవసరమైతే ఇన్‌స్టాల్‌ చేసుకునేలా, లేదంటే వద్దనేలా ఉండాలి.

2016 నుంచీ ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ నెమ్మది నెమ్మదిగా ఈ ప్లగిన్స్‌కు బై చెబుతూ వస్తోంది. ఇప్పుడు ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ 57 నడుస్తోంది. అసలు ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ 52 వచ్చిన తరవాత ఫైర్‌ఫాక్స్‌ కి జావా ప్లగిన్‌ పూర్తిగా దూరమయింది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu