జగన్‌ బాబూ, ఏంటా కామెంట్స్‌?

SriRamaNavami
Pawan Jagan

నలుగురు నలుగురు పెళ్ళాల్ని చేసుకున్న పవన్ కళ్యాణ్ మాటల్ని కూడా వినాల్సి వస్తోందే… అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. మరీ ఇలా వ్యక్తిగత స్థాయి దూషణలకి దిగడమన్నది చిన్న స్థాయి నాయకుల్లో ఉంటుదేమో కానీ, సాధారణంగా పెద్ద స్థాయి నాయకుల్లో కనిపించదు. ఇప్పుడు జగన్ పుణ్యమా అని అది కూడా జరిగిందని కామెంట్స్‌ వస్తున్నాయి.

తాను ఏ పార్టీలోనూ లేనని చెప్పే ఉండవల్లి ఈ విషయం మీద స్పందిస్తూ… జగన్ మాట్లాడింది చాలా తప్పని అన్నారు. ఒక వివరణ కూడా ఇచ్చారు. “ఒక మనిషి నలుగురు పెళ్ళాల్ని చేసుకున్నాడా? ఎంతమందిని చేసుకున్నాడు? సమస్య ఏంటి? అన్నది -వాళ్ళలో వాళ్ళు తేల్చుకోవాల్సిన విషయమే తప్ప- పరాయి వాళ్ళు కామెంట్ చెయ్యాల్సిన విషయం కాదు, అలా కామెంట్ చెయ్యడం చట్టవిరుద్ధం అన్నారాయన.

ఉండవల్లి మరో మాట కూడా అన్నారు. … “ఒక నాయకుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఎంతమంది భార్యలున్నారు? అతని వ్యక్తిగత జీవితమేమిటి? అన్నది ప్రజలు చూడరు. కేవలం అతను మనకు మేలు చేస్తాడా? లేదా? అనిమాత్రమే చూస్తారు” – అంటూ మాట్లాడారు. ఒక విధంగా ఈ వ్యాఖ్య పవన్‌కి సపోర్టయింది. అయితే ప్రజలు తమ మేలు మాత్రమే చూసుకునే మాటయితే – అది న్యాయమేనా? ప్రజలు నాయకులకు నైతికమైన విలువలు ఉన్నాయా అన్నది కొంతవరకైనా కచ్చితంగా చూస్తారు. కానీ మరీ లోతుగా వెళ్లడానికి ఇష్టపడరు.

ఇక్కడ సమస్యల్లా ఏమిటంటే… నైతిక విలువల విషయంలో జగన్‌కి ఒక విధమైన మరక ఉంటే, పవన్‌కి మరో రకమైన మరక ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో సంపాదించాడన్నది జగన్ మీద ఉన్న మరక. చీటికీ మాటికీ భార్యల్ని మార్చుతున్నాడన్నది పవన్ మీద వస్తున్న కామెంట్. అయితే, అవినీతి, పాలిగమీ ( అనేకమందిని వివాహం చేసుకోవడం ) ఈ రెండిట్లో ఏది ఎక్కువ చెడ్డదన్నది నిర్ణయించేవారెవరు? ఈ రెండింటి విషయంలో – పరిపాలన విషయంలో నేరుగా ప్రభావం చూపేది ఏది? అని ప్రశ్నించుకుంటే – అవినీతినే ముందు దోషిగా చెప్పాల్సి వస్తుంది.

ఇక నైతికత విషయంలో ఏకపత్నీవ్రతం అన్నది ప్లస్ పాయింట్ అవుతుందా లేదా? అని ఆలోచించినప్పుడు – రాముణ్ణీ, కృష్ణుణ్ణీ మనం ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏక పత్నీవ్రతుడైన రాముడు గొప్ప పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు గానీ, బహుభార్యల్ని కలిగిన కృష్ణుడు ఏనాడూ గొప్ప పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్న దాఖలాలు లేవనేది కొందరి వాదం. కృష్ణుణ్ణి కూడా విష్ణువు అవతారంగానే, రాముడంతటి గొప్ప దేవుడిగానే మనం కొలిచినప్పటికీ,- పరిపాలన విషయానికి వస్తే రామరాజ్యం అంటాం గానీ, కృష్ణరాజ్యం అని అనం. కృష్ణుడెప్పుడూ రాజ్యం చేసిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి, ఈ లాజిక్‌ ని బట్టి – ఎక్కువమంది భార్యల్ని కలిగినవాళ్ళు గొప్ప పాలకులు కాలేరా? అని మరో ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అయితే, చారిత్రక అంశాల్లోకి వస్తే ఇద్దరు భార్యల్ని కలిగిన శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలకుడు కాలేదా? ఇక్కడ ఇంకో చర్చించాల్సిన అంశం ఏంటంటే – స్త్రీలోలత్వం, బహుభార్యాత్వం – రెండూ వేరు వేరు విషయాలు. స్త్రీలోలత్వం అంటే స్త్రీల పట్ల మోజు కలిగి ఉండటం. చీటికీ మాటికీ వేరువేరు స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం. ఇది వేరు, బహుభార్యాత్వం వేరు. బహుభార్యాత్వం అంటే ఏకకాలంలో అనేకమంది భార్యల్ని కలిగి ఉండటం. శాస్త్రప్రకారం స్త్రీలోలత్వం కంటే బహుభార్యాత్వం ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే – పురుషుడు తన కోరికని తన భార్య, లేదా భార్యల వరకే పరిమితం చేయాలన్నది సమాజంలో నీతి. అయితే, బహుభార్యాత్వం అంటే ఏకకాలంలో అనేకమంది భార్యల్ని కలిగి ఉండడం!

పవన్ కల్యాణ్ విషయం తీసుకుంటే – ఏక కాలంలో అనేకమంది భార్యల్ని కలిగి లేడు. అయితే, తను భార్యగా ఉండగానే పవన్ వేరే ఎవరితోనో క్లోజ్‌గా ఉన్నాడు కనుకే తను దూరంగా ఉండాల్సి వచ్చిందని స్వయంగా అతని మాజీ భార్య రేణూదేశాయ్ చెప్పడం అతనికి పెద్ద మైనస్ పాయింట్.

ఏదో సందర్భం వచ్చింది కాబట్టి ఈ చర్చలన్నీ చేస్తున్నాం గానీ – నిజానికి ఇవన్నీ చాలా వ్యక్తిగత విషయాలు. ఏదో పైపైన కామెంట్ చేసి తేల్చి పడేయాల్సినవి కానే కావు. హద్దులు మీరి అంత లోతుగా వెళ్ళాల్సిన విషయాలూ కావు. ఒకవేళ సామాన్యపౌరులు తమ వ్యక్తిగతమైన సమావేశాల్లో ఏమైనా చర్చించుకుంటే చర్చించుకుంటారు గానీ, నాయకుల స్థాయి వ్యక్తులు ఒకరి మీద ఒకరు ఇలాంటి కామెంట్స్‌ చేసుకుంటే – నిందపడ్డవాళ్ల విలువే కాదు, చేసినవాళ్ల విలువ కూడా పడిపోతుంది. ఈ విషయాన్ని జగన్ గుర్తించాలి.

ఉదాహరణకి “నలుగురు, నలుగురు పెళ్ళాల్ని చేసుకుని..” అంటూ ఏదో ఏకకాలంలో పవన్‌కి నలుగురు భార్యలున్నట్లు జగన్ మాట్లాడారు. అది చాలా తప్పు. అంతేకాకుండా “పెళ్ళాలు” అనే పదం వాడటం కూడా అభ్యంతరకరం. ఎందుకంటే, అవతలి వ్యక్తి భార్య గురించి మనం ఎప్పుడూ మాట్లాడకూడదు, తప్పనిసరయి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ‘భార్య’ అనే గౌరవమైన పదం మనకుంది. ‘పెళ్ళాం’ అనేది కొంచెం కిందిస్థాయి అర్థంలో వాడుతుంటారు. కాబట్టి జగన్‌ – ఆ పదానికి బదులు ‘భార్య’ అనే పదం వాడి ఉంటే మరికొంత గౌరవంగా ఉండి ఉండేది. ఏదేమైనా పెద్దస్థాయి లీడర్లు కావలసిన వాళ్ళు, కావాలని కోరుకుంటున్నవాళ్లు – చిన్న స్థాయి కామెంట్స్ చెయ్యడం మొత్తం రాజకీయాల స్థాయినే దిగజార్చడం ఖాయం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu