చెప్పేది ‘యోటీ’… చేసేది ఒకటీ అయితే?

SriRamaNavami

“మా యాప్‌ ఇన్‌ స్టాల్‌ చేసుకోండి. దాని ద్వారా మీ అన్ని పాస్‌వర్డ్సూ మా దగ్గర పెట్టుకోండి. మీ ఫొటో అడ్రస్‌ పర్సనల్‌ వివరాలన్నీ మా దగ్గర స్టోర్‌ చేసుకోండి. మేం భద్రంగా ఉంచుతాం. చీటికీ మాటికీ ఐడీ ప్రూఫ్స్‌ ఇవ్వక్కర్లేకుండా ఈ యాప్‌తోనే అన్ని పనులూ అయిపోతాయి. ” – ఇలా ఎవరైనా అంటే… మీరు వెంటనే నమ్ముతారా? అనుమానిస్తారా? కానీ పదిలక్షలమంది నమ్ముతున్నారు. మరి ఆ యాప్‌ కథేంటో చూడండి.

గూగుల్ లో ఇప్పుడు ‘యోటీ’ అనే యాప్ వచ్చింది. Your digital identity అనేది దీని ట్యాగ్ లైన్. మన ఐడీని స్కాన్ చేసుకుని, ఆన్‌లైన్‌లో దాచుకుని, ఎక్కడైనా ఐడీ ప్రూఫ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఎవరన్నది రుజువు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ యాప్ డెవలపర్స్ చెబుతున్నారు. యోటీ అన్నది పాస్‌వర్డ్ మేనేజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. Chrome బ్రౌజర్లో గానీ, Firefox బ్రౌజర్‌లో గానీ దీనిని ఇన్‌స్టాల్ చేసుకుని డెస్క్‌టాప్ కంప్యూటర్‌ ద్వారా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని అంటున్నారు.

లాభాల జాబితా పెద్దదే!

ఈ యాప్‌తో లాభాలేమిటంటే డెవలపర్లు చాలా పెద్ద జాబితా చెబుతున్నారు. ” వేగంగా, భద్రంగా మీ ఐడీని మీరు రుజువు చేసుకోవాలంటే ఈ యాప్ చాలా ఉపయోగం. కొన్ని సైట్స్ లో మీ వయస్సు 18 కనీసం ఉండాలని అడిగినప్పుడు అక్కడ ఏజ్‌ కన్ఫర్మేషన్‌ కోసం ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. అలాగే – ఇతరుల ఐడీ వివరాలు నిజమైనవా కావా మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఏదైనా ఆన్‌లైన్ బిజినెస్‌లో మనం భాగస్వామ్యం తీసుకోవాలన్నప్పుడు, మనం ఎవరన్నది ప్రూఫ్‌ అడుగుతారు. అలాంటప్పుడు ఈ యాప్‌ తోనే వారికి ప్రూఫ్ ఇవ్వవచ్చు. యోటీ పాస్‌ వర్డ్‌ మేనేజర్‌ కూడా. దీన్నొక్క యాప్‌ నీ వాడుకుంటే వేరే వెబ్‌సైట్స్‌లోకి పాస్ వర్డ్ అవసరం లేకుండా మన ఐడీ ప్రూఫ్ ద్వారానే లోపలికి లాగిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ”

ఎలా నమ్ముతామండి బాబూ?

ఇన్ని లాభాలు చెబుతున్నప్పటికీ – ఈ యాప్‌ ని నెటిజెన్స్‌ నమ్మడం లేదు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటాం సరే. . ఎప్పుడైతే మన ఐడీని మనమే స్కాన్ చేసి, ఆన్‌లైన్‌లోకి ఎక్కించుకుని మనకు మనమే బయటపెట్టుకుంటున్నామో అప్పుడు సెక్యూరిటీ ఏం ఉంటుంది? – అనే భయం వారిలో ఉంది. అందువల్ల, ఈ యోటీ ఇన్‌స్టాల్ చేసినవారి కామెంట్స్ కొన్ని చాలా నెగిటివ్‌గా ఉన్నాయి. ఈ యాప్‌ ఒక స్కామ్‌ అనీ, ప్రజల ఐడెంటిటీల్ని బహిరంగంగా దొంగిలించడానికి వేసిన పథకం మాత్రమే అనీ.. ఇలాంటి యాప్స్ వేసే పిచ్చి పథకాలకు మేం లొంగం అనీ – అంటూ కొందరు చాలా ఘాటుగా విమర్శలు పెట్టారు. దానికి ఈ డెవలపర్స్ పాజిటివ్‌గా ప్రతిస్పందించారు.

ఇది మీరనుకున్నట్టుగా స్కామ్‌ కాదు. జెన్యూన్‌ యాప్‌. మేం మీ డేటాని ఎంతమాత్రం దొంగతనం చెయ్యం.. అసలు మీ డేటాను మీరు తప్ప మేం కూడా యాక్సెస్ చెయ్యలేమని తెలుసుకోండి. పైగా ఇది AES 256 బిట్ ఎన్‌క్రిప్షన్, అంటే అత్యంత భద్రమైన ప్రమాణాలు గల ఎన్‌క్రిప్షన్! మీ డేటా అంతా హ్యాకర్ల పాలుపడకుండా ఉంటుంది. మీరు తప్ప మేం కూడా యాక్సెస్ చెయ్యలేని విధంగానే ఉంటుంది. కాబట్టి మీ డేటా ఏదైనా మా సర్వర్లో సేవ్ అయి ఉన్నప్పటికీ దానిని అమ్మడం వంటివి జరగవు, సాధ్యం కాదు కూడా! ” -అని చెబుతున్నారు.

పేరో చోట… ఫొటో ఒక చోట…

యోటీలో వ్యక్తుల పేరు, ఫోటో, పుట్టినరోజు లాంటి వివరాలన్నీ విడివిడిగా సేవ్ చేసే పద్ధతి ఉందట. అంటే ఏమిటి? సాధారణంగా ఏదైనా ఒక ఆన్‌లైన్ అకౌంట్‌లో ఒక అకౌంట్‌ని మనం క్రియేట్‌ చేసుకున్నప్పుడు, అక్కడ మన ప్రొఫైల్‌ ఏర్పడుతుంది. ప్రొఫైల్ అన్న పేరుతో అక్కడ మన ఫోటో, పేరు.. అన్నీ ఒకచోటే సేవ్ అయి ఉంటాయి. ఇది హ్యాకర్స్ అటాక్ చేసినప్పుడు ప్రమాదం. దొరికితే అన్నీ ఒకసారే దొరికిపోయే అవకాశముంది. అదే – వ్యక్తుల పేరు, ఫోటో, పుట్టినరోజు లాంటి వివరాలన్నీ విడివిడిగా సేవ్ చేస్తే – ఏ డిటైల్‌ ఎవరిదో లింక్‌ చేసుకోవడం కష్టం కాబట్టి – భద్రత అన్నది ఉంటుంది. మేం ఈ పద్ధతినే పాటిస్తున్నాం. మమ్మల్ని నమ్మండి! – అంటూ డెవలపర్స్ జవాబిస్తున్నారు. అయినప్పటికీ జనం కొంతమంది ఐడెంటిటీ థెఫ్ట్ జరుగుతుందేమో ఈ యాప్‌ ఇన్‌ స్టాల్‌ చేసుకోవడానికి భయపడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికే 10 లక్షలమందికి పైగా జనం యోటీ యాప్‌ ని డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. . అంటే, ఈ యోటీని అంతమంది నమ్ముతున్నారన్న మాట. మరి యోటీ వాళ్లు… చెప్పింది ఒకటీ చేసేది ఒకటీ అయితే ఎవరు బాధ్యులు? గూగుల్ ప్లేస్టోర్ ఆ బాధ్యత తీసుకుంటుందా? ఏదేమైనా జనంలో ఆన్‌ లైన్‌ భద్రత పట్లా, డేటా సెక్యూరిటీ పట్లా ఇంత జాగ్రత్త ఏర్పడడం మంచి పరిణామమే అనుకోవచ్చు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu