చంద్రుడి మీదకి వెళ్తారా? కుజుడి మీదకి పోతారా?

F2 Movie

చంద్రుడు, కుజుడు లాంటి ఇతర గ్రహాల మీద నివసించాలన్నది మనిషికి చిరకాలంగా ఉన్న కోరిక. ( అఫ్‌కోర్స్‌, చంద్రుడు గ్రహం కాదు కదా? ఉపగ్రహం కదా అని అసందర్భమైన లాజిక్కులు లాక్కండిక్కడ! ) అయితే మనిషి నివసించాలంటే – అక్కడ నీళ్లుండడం తప్పనిసరి. నీళ్లు లేని చోట సంస్కృతి బతికి బట్టకట్టలేదని పెద్దలు అంటారు. సంస్కృతి మాట దేవుడెరుగు, అసలు తాగడానికి నీళ్లు దొరకని ప్రదేశంలో మనిషి జీవయాత్రే అసాధ్యమైపోతుంది. ఒక్కరోజు నీళ్లు రాకపోతేనే జీవితాలు అస్తవ్యస్తం అయిపోతుంటాయి. కాబట్టి – ఇటు చంద్రుడు కావచ్చు, అటు అంగారకుడు ( మార్స్, కుజుడు) కావచ్చు. గ్రహం ఏదైనా – దాని మీద నివాసం చేయాలంటే ముందు అక్కడ జీవనానికి తగిన వాతావరణం ఉండాలి. అందులో అతి ముఖ్యమైనది నీరు. చంద్రుడి మీద కాలనీలు లేపేస్తాం, మార్స్‌ మీద మనుష్యలోకం నిర్మిస్తాం – అని చెప్పేవాళ్లంతా – ముందు అక్కడ నీటి నిల్వల కోసమే అన్వేషణలు సాగిస్తూ ఉంటారు.
అయితే – నీటి విషయంలో కొత్తగా ఆశలు చిగురించాయి. చంద్రుడి మాటకొస్తే – ఆ గ్రహపు ఉత్తర ధ్రువానికి దగ్గర ప్రాంతంలో కాలిఫోర్నియా శాస్త్రజ్ఞులకి ఒక చోట పెద్ద పెద్ద గొట్టాల్లాంటి రూపాల్లో శిలాద్రవం (లావా ) కనిపించిందట . చిన్న చిన్న ద్వారాలలాగ కనిపించే ప్రాంతాల్ని మరింత శోధించి లోపలికి వెళ్లగలిగితే – ఆ గర్భంలో పెద్ద పెద్ద నదుల్లాంటి మంచు నిల్వలు ఉండచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. వారి అంచనాయే నిజమైతే – చంద్రుడి మీద నివాసానికి అవసరమైన జల వనరులు లభించినట్లే అవుతుంది. అదే జరిగితే – సామాన్యుడి చంద్రయానానికి ఒక గొప్ప సోపానం ఏర్పడినట్టే!
ఇక మార్స్‌ విషయానికొస్తే ఈ వారంలోనే నాసా వాళ్లు ఓ ప్రకటన చేశారు. కుజుడిమీద నీరు ఉండడమే కాదు, దాన్ని పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు – అని నాసా శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. కాబట్టి – అంగారక గ్రహ యాత్రకి కూడా అడ్డంకులు తొలగుతున్నట్టే! కాబట్టి ఇప్పుడు చెప్పండి. మీరు చంద్రుడిమీదకి వెళ్తారా? కుజుడి మీదకి ప్రయాణం చేస్తారా? మీ ఇష్టం మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu