చంద్రబాబు క్లైమాక్స్‌ ప్లాన్‌ ఏంటి?

F2 Movie

చంద్రబాబు ఈసారి గెలిచే అవకాశం లేదని చాలామంది తెలుగుదేశం అభిమానులే బాహాటంగా చెబుతున్నారు. రాజధానిలో పనులు పెద్దగా జరగని దృష్ట్యానూ, జగన్‌, పవన్‌లకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యానూ ఆంధ్రా రాజకీయ చిత్రం మారిపోతోంది. ఓ పక్క జగన్‌ పాదయాత్రతోనూ, మరో పక్క పవన్‌ మాటల తూటాలతోనూ జనాన్ని ఉర్రూతలూగించేస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు సమావేశాలు, ఉపన్యాసాలు చప్పగా అనిపించడం సహజమే. అదీ గాక – ఒకసారి ఫెయిలయిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న తెలుగుదేశం మళ్లీ గెలవడానికి – చంద్రబాబుకున్న దశాబ్దాల ఇమేజే కారణం కావచ్చన్నది ఒక అంచనా.

“చంద్రబాబుని ఎప్పటినుంచో చూస్తున్నాం. అతనింక ఇంతే! అతని పాలన ఇలాగే ఉంటుంది. అదే – జగన్‌ కో పవన్‌ కో ఓటేస్తే – కాస్త పరిపాలనలో కొత్తదనం వస్తుంది. మంచి జరిగే అవకాశం ఎంత ఉన్నా – ముందంటూ ఒక మార్పు కనిపిస్తుంది. పైగా – చంద్రబాబుకి మనం చేసిన అన్యాయం ఏమీ లేదు. ఆయన అనుభవాన్ని గౌరవించి ఆల్రెడీ ఆయనకో ఛాన్సిచ్చి చూశాం. కానీ అనుకున్న స్థాయిలో ఆయన పనిచేయలేకపోయాడు. కాబట్టి ఈసారి వీళ్లకి ఛాన్సిద్దాం ” – అని జనం ఫీలవుతున్నారని రాజకీయ వర్గాల అంచనా. పైగా కాలక్రమంలో అధికారంలో ఉన్న పార్టీ పట్ల వ్యతిరేక ఓటు బ్యాంక్‌ అనేది సహజంగానే ఏర్పడుతుంది. తెలుగుదేశానికీ ఇప్పుడు అదే జరుగుతోంది.

తెలుగుదేశం ఓటమి మరీ కచ్చితం అని చెప్పకపోయినా – చాలావరకూ వారు తిరిగి అధికారంలోకి రాకపోయే అవకాశమే అంతటా కనిపిస్తోంది. మరి ఇలా విషయం తేటతెల్లంగా తేలిపోయినప్పుడు – చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? ఉండవల్లి చెప్పినట్టు ఎన్నో ఎలక్షన్లు మేనేజ్‌ చేసిన అనుభవం చంద్రబాబుకి ఉంది. కాబట్టి ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేస్తాడు? అసలు ఏం చేయాలి? చంద్రబాబు గెలుపుకోసం ప్రస్తుతం వెంటనే చేయాల్సిన పని – రాజధానిలోనూ ప్రాజెక్టుల విషయంలోనూ పనులు వేగంగా జరపడం, జరుగుతున్నట్టు చూపించడం. అయినా నాలుగు ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగు నెలల్లో చూపించడం ఏమంత సులువు కాదు. కాబట్టి – ఈ పనులు చేస్తూనే – ఎలక్షన్లు దగ్గరపడేనాటికి ఏదో ఒక అద్భుతం చేయాలి. అందుకే చంద్రబాబు ఏదో మాస్టర్‌ ప్లాన్‌ వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

మళ్లీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు వేస్తున్న  క్లైమాక్స్‌ పథకం ఏంటన్నది అంత తొందరగా బయటపడకపోవచ్చు. నిజానికి కిందటిసారే తెలుగుదేశం ఓడిపోవాల్సి ఉంది. కానీ తెలంగాణ విడిపోవడం చంద్రబాబుకి కలిసొచ్చింది. మరి ఈసారి అలాంటి పాయింట్‌ ఏం ఉంది?  మోదీ ప్రత్యేకహోదా ఇవ్వకపోవడాన్ని బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతున్నా – అది తెలుగుదేశం విజయానికి పెద్దగా దోహదపడకపోవచ్చు. ఎందుకంటే – ఇంతకాలం అంటకాగి ఇప్పుడు బీజేపీని తిట్టడంలో జనానికి సమంజసత్వం కనిపించడం లేదు.  మోదీ వ్యతిరేకత ఒక్కటి మాత్రమే అయితే ఎలక్షన్లో తెలుగుదేశానికి ఉపయోగపడదు. మరేదో కావాలి. ఆ మరేదో ఏమిటి? ఒక ప్రత్యేక రాజకీయ ప్రణాళికనో నినాదాన్నో ఆధారంగా చేసుకుని – ఏదో ఓ కొత్త పాయింట్‌ తో చంద్రబాబు ప్రజల్లోకి వస్తారన్నది రాజకీయ మేధావుల అంచనా. అదేంటన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్‌!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu