క్రెడిట్‌ కార్డ్‌ తో పే చేస్తే దేవతల్ని ఒప్పిస్తాడు!

F2 Movie

మీ క్రెడిట్‌ కార్డ్‌ లో క్రెడిట్‌ లేదా? కార్డ్‌ టైమ్‌ అయిపోయిందా? అయితే మీకు దేవతల అనుగ్రహం పొందే ఛాన్స్‌ మిస్సయిపోయినట్టే! అవును. ఈ ‘ప్యాడ్రే’ గారు అదే చెబుతున్నాడు!

ఈయనకి దేవతలతో అగ్రిమెంట్ ఉంది

” ఇండియన్ జ్యోతిష్కులు ప్రజల్ని భయ పెట్టి, ఆశపెట్టి డబ్బులు పిండుతారు” అంటూ నాస్తిక మేధావులు నిత్యం విరుచుకుపడుతూ ఉంటారు ప్రజా క్షేమం కోసమే తమ పోరాటం అని భావించే వీళ్లు – జ్యోతిషం మీద ఆధారపడడాన్ని ఓ మానసికమైన బలహీనతగా ఎప్పుడో తేల్చేశారు. అయితే జ్యోతిషాన్ని కించపరచడం భారతీయ సంప్రదాయాన్ని కించపరచడం కాదా? – అని జ్యోతిష్కులు వాళ్ల మీద విరుచుకుపడుతున్నారు. అయితే మనుషుల్ని జ్యోతిషం పేరుతో భయపెట్టి డబ్బులు లాగడంలో- ఇండియన్స్ మాత్రమే కాదు విదేశీ జ్యోతిష్కులు కూడా ఎందరో ఉన్నారన్నది గుర్తించాలి. వీళ్లతో పోలిస్తే భారతీయ జ్యోతిష్కులు ఎంతో నయం అనిపిస్తుంది.
మనకి కష్టాలు వచ్చినప్పుడు కొందరు దేవతలు మనకి రక్షగా ఉంటారని విదేశాల్లో నమ్ముతారు. వాళ్ళని ‘గార్డియన్‌ ఏంజెల్స్‌’ ( రక్షకదేవతలు) అంటారు. మరి అలాంటి దేవతల్ని తన అదుపులో పెట్టుకోవడం సాధ్యమా? సాధ్యమేనట. ఈ ఇమేజ్‌లో కనిపించే ‘ప్యాడ్రే’ అనే మహానుభావుణ్ణి చూడండి. ఈయనే అలా దేవతలతో మాట్లాడే ఓ దేవదూత అట! ఆయనే అలా చెప్పుకుంటాడు. గార్డియన్‌ ఏంజెల్‌ రీడింగ్‌ డాట్‌కామ్‌ అనే తన వెబ్‌సైట్లో ఈయన తన వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. మీకు సమస్యలేవైనా ఉంటే నేను దేవతలతో మాట్లాడి మీకు ఇబ్బంది కలక్కుండా చేస్తానంటాడు. అలా చేయడానికి – మీ క్రెడిట్ కార్డ్ తో ఈ మూడు వేలు డబ్బు కట్టండి అని అడుగుతుంటాడు. నిజంగానే కష్టాల్నించి రక్షించగలిగే దేవతలు ఉంటే… వాళ్లని ప్రార్థిస్తే వారే రక్షించాలి గానీ… మనం ఈయనకి క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేస్తే రక్షించడం ఏంటి?, ఈయనకీ దేవతలకీ ఉన్న అగ్రిమెంట్‌ ఏంటి? – అన్నది మనకి అర్థం కాని విషయం!

కుదిరితే ఆశ… లేకపోతే బెదిరింపు

ఏదేమైనప్పటికీ జనాన్ని ఆశపెట్టడం, అవసరమైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు బెదిరించడం – ఈ మార్గాల్లో డబ్బులు వసూలు చేయడం సదరు ప్యాడ్రేగారికి అలవాటులా ఉంది. ఈయన తన సైట్లో – లేదా మనకి పంపే ప్రమోషన్‌ ఇ-మెయిల్స్‌ లో ఈయన చెప్పేది ఎలా ఉంటుందంటే – “ఇప్పుడు మీ గ్రహస్థితి చాలా బాగుంది. ఆ విషయాన్ని నాకు గార్డియన్‌ ఏంజెల్‌ చెప్పింది. కాబట్టి మీకు ఇప్పుడు హఠాత్తుగా కొన్ని కోట్లు వచ్చి పడిపోతాయి. కానీ చిన్న చిన్న అడ్డంకుల వల్ల మీరు అదృష్టం కాకెత్తుకుపోయే అవకాశం ఉంది. అందుకే మీరు నాకు డబ్బు కట్టేస్తే – నేను ఆ ఫలానా దేవతతో మాట్లాడి మీ ప్రాబ్లెం కాస్తా సాల్వ్ చేసేస్తాను” – అంటాడు. పైగా దీనికి టైమ్‌ లిమిట్‌ కూడా పెడతాడు. ఫలానా తేదీలోగా కూడా కాదు… ఇదిగో సరిగ్గా ఇన్ని గంటల్లోగా డబ్బు కట్టకపోతే నువ్వు అదృష్టంమిస్సయిపోతావు, అని కౌంట్‌ డౌన్‌ టైమర్‌ పెడతాడు. మీరు డబ్బుకట్టేస్తే సరే! మీరు ఈ ఆశకి లొంగలేదనుకోండి, ఆయన తరవాతి అస్త్రం భయపెట్టడం! “చెప్పిన గడువుదాటిపోతే కొంప మునిగిపోయే ప్రమాదం ఉంది, ఈ విషయం నాకు దేవతల ద్వారా తెలిసింది, కాబట్టి నువ్వు డబ్బు కట్టేస్తే నేను వాళ్ళతో మాట్లాడేసి సెటిల్ చేసేస్తాను, మరి చూసుకో” అంటాడు. దానికి కూడా మళ్ళీ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్!

పదమూడు శుక్రవారం కాంబినేషన్లో..

ముఖ్యంగా కొన్ని ప్రముఖమైన తేదీలు వచ్చినప్పుడు ఈయన ఆగడాలు మరీ మితిమీరి పోతాయి. ఉదాహరణకి విదేశాల్లో చాలామంది పదమూడుని అశుభ సంఖ్యగా భావిస్తారు. అందులోనూ అది ఏ శుక్రవారమో వచ్చిందంటే – ‘ఫ్రైడే ద థర్టీన్త్‌’ ( Friday the 13th) అంటూ ఇంకా చెడ్డదిగా భావించి, ఏదో చెడు జరుగుతుందన్నట్టు భయపడతారు. మరి ఇటీవల జూలైలో అలాంటి పదమూడూ, శుక్రవారం కాంబినేషన్ వచ్చింది. ఇక మనవాడికి పండగే పండగ! “అదుగో ప్రమాదం, ఇదుగో ప్రమోదం, వెంటనే మేలుకోండి. మూడువేలు కట్టండి. మీకు చెడు కాస్తా తొలగిపోతుంది పైగా విపరీతంగా డబ్బులొస్తాయ్‌, మీ లైఫే స్వర్గం అయిపోతుంది” అని మెయిల్స్ మొదలుపెట్టాడు. ఆ తేదీ వచ్చే వరకూ ప్రతిరోజూ ఒకటి రెండుసార్లు మెయిల్ పంపించి, కస్టమర్లని భయపెట్టడం లేదా ఆశపెట్టడం… ఇదే మన వాడి పని అయిపోయింది. భారతీయులకి సాధారణంగా ఈ ఫ్రైడే థర్టీన్‌ సెంటిమెంట్‌ లేదు కాబట్టి మనవాడికి ఇక్కడ కలెక్షన్స్‌ నిల్‌! లేకపోతే ఎంతో మంది క్రెడిట్‌ కార్డులు గుల్లయిపోయేవే!

టీవీ చర్చల మేధావులూ! ఎక్కడున్నారు?

ఏదో కాస్త లాజిక్‌ చెప్పి – “నీకు ఇప్పుడు టైమ్‌ బాగుంది, ఈ పని చేస్తే కలిసొస్తుంది” – అని సూచనప్రాయంగా సలహాలు చెప్పే జ్యోతిషం కొంతవరకూ ఓకే అనచ్చేమో! ఎందుకంటే – కొంతమందికి తమ టైమ్‌ బాగుంది అని నమ్మకం కలిగితే కొంత హుషారు వచ్చి ఎక్కువ పని చేసే అవకాశం ఉంది. విజయం సాధించే అవకాశం ఉంది. గ్రహస్థితులను బట్టి అలా చెయ్ ఇలా చెయ్‌ అని ఇచ్చే సలహాలు ఎంతవరకూ పనిచేస్తాయో తెలియదు గానీ, ఒక హద్దు దాటకుండా రాశిఫలాలు, దినఫలాలు రాసుకోవడం, చదువుకోవడం సంప్రదాయ కోణంలో చూస్తే ఓకే అనచ్చు. కానీ దాన్ని వ్యాపారంగా చేసుకుని బతకాలనే ఉద్దేశంతో – జనాన్ని భయపెట్టే వాళ్లని మాత్రం అల్లంత దూరంలో ఉంచాలి. జ్యోతిషం అన్నదే శుద్ధ అబద్ధం అని కొందరంటే- కాదు నిజం అని మరికొందరంటారు. జ్యోతిషం పచ్చి మోసం అని నాస్తికులు వాదిస్తుంటే – సంప్రదాయంలో ఉన్నదాన్ని సరిచేసుకోవాలి గానీ తిట్టడం ఎందుకు? – అంటారు సంప్రదాయవాదులు. కానీ ఇటు వైపూ అటు వైపూ కూడా మూర్ఖత్వం ఉందని చెప్పక తప్పదు. అదే ఇప్పుడు జ్యోతిషానికున్న కాస్తో కూస్తో గౌరవాన్ని బాగా తగ్గించేసింది.
టెక్నాలజీ పెరిగి, ఇమెయిల్స్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ వచ్చాక ఇలాంటి విదేశీ ప్యాడ్రేలు కూడా భారతీయుల మీద దాడి చేస్తున్నారు. అసలే సెంటిమెంటుల పుట్ట అయిన భారతదేశంలో ఈ విదేశీ ఆస్ట్రాలజర్ల ఆగడాల వల్ల ఏం మేలు కలుగుతోందో వాళ్లకే తెలియాలి. “మాకు మతభేదాలు, దేశ భేదాలు లేవు. ఎక్కడైనా ఎవరి విషయంలోనైనా మూఢవిశ్వాసాల మీద పోరాడతాం” అంటూ టీవీల్లో చర్చలకి వచ్చి మన సంప్రదాయ విద్యల్ని రచ్చ చేసే నాస్తిక ప్రముఖులు – ఇలాంటి విదేశీ దోపిడిగాళ్ళ మీద కూడా పోరాటం చేస్తే ఎంతో బాగుంటుంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu