కీరవాణి నిజంగా ఘోరమైన తప్పు చేశాడా?

F2 Movie

రామ్‌గోపాల్‌ వర్మ గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాకి కీరవాణి సంగీతం అందించడం మీద మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. మహా సంగీతదర్శకుడు, దైవభక్తుడు, శివదీక్షాతత్పరుడు అయిన కీరవాణి గారు – శృంగారతార నటించే అశ్లీల చిత్రానికి మ్యూజిక్‌ చేయడం ఏంటని – అటు సంప్రదాయ మీడియావాదులు, ఇటు సోషల్‌ మీడియా యోధులు రోజుల తరబడి కొట్టుకుంటున్నారు. అయితే కీరవాణి చేసింది అత్యంత ఘోరమైన తప్పా? అన్నది ఆలోచిద్దాం.

నిజమే. కీరవాణి గొప్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌. స్వరాలూ రాగాలే తెలియని నేటితరం మ్యూజిక్‌ డైరెక్టర్ల మధ్య- శాస్త్రీయ సంగీత జ్ఞానం ఉన్న అతి కొద్ది మందిలో ఆయనొకడు. అయితే ఆయన ఓ కమర్షియల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. దైవభక్తీ, దీక్షలన్నవి ఆయన వ్యక్తిగత విషయాలు. కమర్షియల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అన్నాక – డబ్బుకోసం పనిచేయాలి. నచ్చితే ఏ సినిమాకయినా మ్యూజిక్‌ అందించే హక్కు ఆయనకి ఉంది. అయ్యో! అదేంటి? రామ్‌గోపాల్‌వర్మ ఏదో భ్రష్ఠుడన్నట్టూ, ఆయన చిత్రాలు ముట్టుకోకూడనంత అపవిత్రమైనట్టూ, కీరవాణి లాంటి మహా భక్తుడు – వాటి జోలికి వెళ్లకూడదన్నట్టూ కొందరు చెబుతున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు – లాంటి భక్తిరస చిత్రాలకు సంగీతం అందించి – ఇప్పుడిలా చేస్తాడా? – అన్నట్టు మాట్లాడుతున్నారు.

అసలు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కీరవాణి చరిత్ర చూద్దాం. కీరవాణి తొలినాళ్లలో రామోజీ చిత్రం మనసు-మమతకి సంగీతం అందించినా – గుర్తింపు రానే లేదు. తరవాత రామ్‌గోపాల్‌ వర్మ క్షణక్షణం తోనే కీరవాణి ఎవరో ప్రపంచానికి తెలిసింది. ఆ తరవాత – వర్మకీ కీరవాణికీ మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తరవాత కూడా వర్మ కార్పొరేషన్‌ బ్యానర్‌కింద – వంశీ డైరెక్షన్‌ లో వర్మ తీసిన వైఫ్‌ ఆఫ్‌ వి.వరప్రసాద్‌ సినిమాకి కీరవాణే సంగీతం అందించాడు. ఆ కృతజ్ఞతతోనో, ఆ అనుబంధంతోనో ఇప్పుడు వర్మ సినిమాకి కీరవాణి ఒప్పుకొని ఉండచ్చు. దాంట్లో తప్పు ఏముంది?

పోనీ – వీళ్లు ఆరోపిస్తున్నట్టు కీరవాణి గతంలో చేసిన భక్తిరస చిత్రాల లిస్టే తీసుకుందాం. అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు – ఇవి తీసిందెవరు? హీరోయిన్‌ బొడ్డు మీద పూలూ పళ్లూ జల్లించే శృంగార దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కె.రాఘవేంద్రరావు కాదా? అన్నమయ్య చిత్రంలో సాక్షాత్తూ దేవుడి నోటి వెంటే బూతు డైలాగులు చెప్పించాడని ఆయనకి చెడ్డ పేరు రాలేదా? ఇక భక్తి పేరు చెప్పి తీసిన పాండురంగడు లో టాబూ చేత చేయించిన అశ్లీల విన్యాసాలు ఒకటా రెండా? అసలవి భక్తి చిత్రాలా? రక్తిచిత్రాలా? అన్న వివాదం కూడా ఉంది. మరి భక్తి ముసుగులో శృంగారం చూపించిన ఆయన సినిమాలకి చేస్తే లేని తప్పు – ఇక్కడ పచ్చిగా ఫ్రాంక్‌గా శృంగారమే చూపిస్తానన్న సినిమాకి మ్యూజిక్‌ అందిస్తే మాత్రం వచ్చేస్తుందా? –  అన్నది కీరవాణి విమర్శకులే తేల్చి చెప్పాల్సి ఉంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu