కన్నడ ‘రచిత’కి తెలుగు లక్ ఎప్పుడు?

F2 Movie

కన్నడ హీరోయిన్లు తెలుగులో పేరు తెచ్చుకోవడం మనకి కొత్తేం కాదు. సౌందర్య, ఆమనిలాంటి వాళ్ళు తెలుగులో ఎంతో పేరు తెచ్చుకున్నారు. టాప్ హీరోయిన్స్ గా కూడా కొనసాగారు. ఆ తరవాత ప్రేమ కూడా మంచిపేరే తెచ్చుకుంది. అయితే మొత్తం మీద చూస్తే – మలయాళ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ – కన్నడ హీరోయిన్స్ కి మన దగ్గర లేదు.

మాలాశ్రీ టాప్… రమ్య టాప్

అతికొద్ది మంది తప్ప కన్నడ హీరోయిన్లు సాధారణంగా తెలుగువాళ్లకి పెద్దగా నచ్చరు. ఇంకా చెప్పాలంటే – మనం రిజెక్ట్ చేసిన హీరోయిన్లు అక్కడ బాగా సక్సెస్ అయిన సందర్భాలు చూశాం. ఒకప్పుడు తెలుగులో ‘శ్రీ దుర్గ’ అనే పేరుతో చెల్లెలి పాత్రల్లో నటించిన అమ్మాయి – మాలాశ్రీ అనే పేరుతో కన్నడలోకి వెళ్లి – ఆ తరవాతి కాలంలో కన్నడలోనే టాప్ హీరోయిన్ అయి కూర్చుంది. ఆ తరవాత మళ్లీ మనం ‘బావ-బావమరిది’ లాంటి చిత్రాల్లో అదే మాలాశ్రీ ని తిరిగి ఆదరించటం వేరే సంగతి. అలాగే కళ్యాణ్ రామ్ నటించిన ‘అభిమన్యుడు’ చిత్రంలో హీరోయిన్ గా చేసిన ‘దివ్య స్పందన – తరవాతి కాలంలో ‘రమ్య’ పేరుతో కన్నడలో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి కూడా ఎదిగింది. మన అభిరుచులు వేరనడానికి ఇవే ఉదాహరణలు.

పెద్ద హీరోయిన్ అయినా…

మనం రిజెక్ట్ చేసిన హీరోయిన్లని టాప్ హీరోయిన్స్ చేసే సంప్రదాయం ఉన్న కన్నడ రంగం నుంచి – కొంతమంది మాత్రం తెలుగులోకి వచ్చి టాప్ అయ్యారు. అలా మనం అంగీకరించని కన్నడ హీరోయిన్లని చూస్తే – తెలుగు టేస్ట్ కి వాళ్లు సూటవ్వరని సులువుగానే తెలిసిపోతుంది. కానీ ‘రచిత రామ్’ విషయం అలా కాదు. రచితకి కన్నడలో ఇప్పుడు ఎంతో క్రేజ్ ఉంది. ‘బుల్ బుల్’ అనే సినిమాతో 2013 లో కన్నడ రంగంలోకి వచ్చిన రచిత రామ్ – తరవాత దర్శన్ పక్కన తొలిసినిమాలో చేసింది. తరవాత దర్శన్ తోనే అంబరీశ, జగ్గు దాదా లాంటి సినిమాల్లో నటించింది. అలాగే ముంగారు మళె అనే సినిమాతో పెద్ద హిట్‌ కొట్టిన గణేష్ తో కూడా నటించింది. ఈగ, బాహుబలిల్లో నటించిన కిచ్చ సుదీప్ తో 2016 లో ‘ముకుంద మురారి’ లో నటించింది రచిత. ఇప్పుడు ఐ లవ్ యూ, రుపి అనే చిత్రాల్లో ఉపేంద్రతో కూడా నటిస్తోంది. వీళ్లే కాదు. రమేష్ అరవింద్ ,పునీత్ రాజ్ కుమార్ – ఇలా కన్నడ ప్రముఖ హీరోలందరితోనూ రచిత రామ్ నటించింది.

నిన్ను చూడగానె చిట్టిగుండె

రచిత రామ్‌ గురించి కరెక్ట్‌ గా చెప్పాలంటే – ‘అత్తారింటికి దారేది’ సినిమాని గుర్తు చేసుకోవాలి. పవన్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వచ్చిన ఈ సూపర్‌ హిట్‌ మూవీని 2015 లో సుదీప్‌ తో రీమేక్‌ చేశారు. ఆ సినిమా పేరు ‘రన్న’ ఈ చిత్రం ఒక బంపర్ హిట్. రన్న అంటే మనవడు, తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసే అలవాటున్న కన్నడ రంగంలో ఇది చాలా కాస్ట్లీ సినిమా అని చెప్పచ్చు. ‘ నిన్న చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే ‘ ప్లేసులో వచ్చే కన్నడ సాంగ్‌ తోనూ, తితిలీ తితిలీ అనే మరో సాంగ్‌ తోనూ రచిత ఎంతో క్రేజ్‌ తెచ్చుకుంది.
మరి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రచితకి తెలుగులో ఇప్పటికీ సరైన ఎంట్రీ రాకపోటం విచిత్రమే అనిపిస్తుంది. ఏదో ఒక్క అవకాశం ఇటీవలే వచ్చిందని మాత్రం వార్తలొచ్చాయి. అమ్మాయి బాగోదా అంటే… అదేం కాదు. తెలుగువారికి నచ్చే ఫేస్‌ కాదా అంటే… నచ్చే ఫేసే. కానీ ఎందుకో ఇంకా ఎంట్రీ లేదు. అయితే రచిత తరవాత వచ్చిన కన్నడ పిల్ల రష్మిక మందణ్ణకి మాత్రం తెలుగులో ఇప్పుడు ఎన్నెన్నో ఛాన్సులు వస్తున్నాయి. ఏదైనా సినిమాల్లో అవకాశాలు రావాలంటే లుక్కే కాదు, లక్‌ కూడా ఉండాలేమో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu