ఒకే నెలలో ఒకే హీరోవి మూడు సినిమాలు!

F2 Movie

అప్పుడెప్పుడో బాలకృష్ణ సినిమాలు నిప్పురవ్వ, బంగారుబుల్లోడు ఒకే రోజు రిలీజ్‌ అయితే ఓ వింతగా చెప్పుకున్నారు. హీరో అన్న తరవాత సినిమాకీ సినిమాకీ మధ్య కనీసం ఆరునెలలైనా గ్యాప్ ఉండాలి. అదే స్టార్‌ హీరో అయితే – కనీసం ఏడాదికో సినిమా అయినా వస్తుందో రాదో తెలియకూడదు. ఇలా ఉంటుంది మన తెలుగు హీరోల మూవీ ప్లానింగ్!  కానీ ఒకే హీరో సినిమాలు ఒకే నెలలో ఏకంగా మూడు రావడం గురించి విన్నారా? అవును. ఇది నిజం! కానీ ఇది తెలుగులో కాదు. మలయాళంలో!

మాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి  మనవాళ్లలా సినిమాకీ సినిమాకీ ఏళ్ల తరబడి గ్యాప్ ఇవ్వరు.  ఒకప్పటి మన సూపర్‌ స్టార్‌ కృష్ణ స్థాయిలో – ఏడాదికి 15 సినిమాలు చేయకపోయినా – వీలైనంత వెంటవెంటనే సినిమాలు చేస్తుంటారు.  తమ సినిమాల మధ్య రెండు మూడు నెలల గ్యాప్‌ ఉండేలా మాత్రం చూసుకుంటూ ఉంటారు. కాబట్టి – ఒక హీరో సినిమాలు ఒకే నెలలో మూడు రావడం అన్నది – అక్కడ కూడా చాలా అరుదైన విషయం. ఈ మేజిక్‌ మలయాళ హీరో పృథ్వీరాజ్‌ విషయంలో జరిగింది.

పృథ్వీరాజ్‌ మరీ చిన్న హీరో ఏమీ కాదు. మలయాళంలో సీనియర్‌ హీరోల్లో ఒకడు. పోలీస్‌ వేట, శివపురం, ఏటీఎం లాంటి మలయాళ డబ్బింగ్‌ సినిమాల ద్వారా – పృథ్వీరాజ్‌ తెలుగువాళ్లకి పరిచితుడే! అతని సినిమాలు మూడు చిత్రాలు ఒకే నెలలో రావడం,  ఆ మూడింటిలో రెండు సినిమాలు ఇప్పటికే రిలీజై హిట్‌ కూడా అవడం ఓ విశేషం అయింది.

ఈ జూలై 6న పృథ్వీరాజ్‌ నటించిన ‘మై స్టోరీ’ మూవీ రిలీజయి.. మంచి విజయం సాధించింది. ఈ నెల 14న అతను నటించిన మరో చిత్రం ‘కూడే’ విడుదలయింది. అది కూడా విశేషమైన జనాదరణ పొందింది. ఇక మూడో చిత్రం ‘రణం’ ఈ నెల 28 నవిడుదల. ముందు రిలీజైన రెండు చిత్రాలూ రొమాంటిక్ లవ్ స్టోరీస్ అయితే – ‘రణం’ చిత్రం మాత్రం పూర్తి యాక్షన్ చిత్రం. ఈ సినిమాకి కూడా మంచి టాకే ఉంది. మొత్తానికి ఒక నెలలో వరస చిత్రాలతో రావడం మాత్రమే కాదు, ఆ మూడూ హిట్‌ కూడా అయితే అది మామూలు హ్యాట్రిక్ని మించిన గొప్ప హ్యాట్రిక్ అవుతుంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu