ఈ హీరోయిన్‌కు లక్కే లక్కు! మరి అవుతుందా క్లిక్కు?

PremaLekhalu

ప్రేక్షకులు ఆమెను తెర మీద ఇంకా చూడనే లేదు. ఎలా నటిస్తుందో తెలీదు. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న ఆమె తొలి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది కూడా తెలియకుండానే మరో మూడు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. ఇంతకీ ఈమె ఎవరంటే… నిశ్వికా నాయుడు. ఒక సినిమా పూర్తి చేసుకుని, మరో సినిమాలో ఎప్పుడు ఆఫర్ వస్తుందా… అని స్టార్స్ సైతం గుడ్లప్పగించి ఎదురు చూస్తున్న రోజుల్లో నిశ్విక మాత్రం, తన మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే మరో 3 ఆఫర్లతో నిశ్చింతగా కూర్చుంది. శాండల్‌వుడ్‌‌లో అనీశ్ తేజేశ్వర్ హీరోగా వస్తున్న “వాసు నాన్ పక్కా లోకల్” సినిమాతో తెరంగేట్రం చేయనున్న నిశ్విక, ప్రస్తుతం సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా సరసన “అమ్మా ఐ లవ్ యు” (విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ రీమేక్)లో ఛాన్స్ దక్కించుకుంది. ఇంకోవైపు మరో కన్నడ నిర్మాత కె.మంజు కుమారుడు హీరోగా తెరకెక్కనున్న “పడ్డెహులి” సినిమాలోనూ బుక్కైంది.

శాండల్‌వుడ్‌లో పరభాషా హీరోయిన్లకే పెద్దపీట వేస్తారని, కన్నడ హీరోయిన్లను అస్సలు ప్రోత్సహించరని, అందులోనూ కొత్తవారిని అంతకన్నా పట్టించుకోరనే అపవాదు నేపథ్యంలో ఒక్క సినిమా కూడా విడుదలవకుండానే ఛాన్స్‌ల మీద ఛాన్స్‌లో రావడంపై ఈ కొత్త కన్నడ హీరోయిన్‌ నిశ్విక భలే ఖుషీగా ఉందట. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాల్లో ఏది తనకు మంచి బ్రేక్ ఇస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటోంది. సినీ రంగంతో ఏ మాత్రం పరిచయం లేని కుటుంబం నుంచి వచ్చిన నిశ్విక ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేసింది. హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో వచ్చి, అనుకున్న అవకాశాన్ని దక్కించుకుంది. నిశ్విక గురించి తెలియకుండానే ఇన్ని ఆఫర్లు ఎలా వచ్చాయనే సందేహం అందరికీ వస్తుంది. సెట్స్‌లో ఆమె ప్రవర్తన, నటిస్తున్న తీరు గురించి నోటి మాటగా అలా అలా దర్శకనిర్మాతలకు చేరి ఆఫర్ల వెల్లువగా మారింది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu