ఇప్పుడు కుమ్మేద్దాం! రేపు మరిచిపోదాం!

SriRamaNavami

కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. కరుణానిధి.. ఇప్పుడు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా ఇదే మాట. అదే వ్యక్తి గురించి వివరాలు. ఆయన జీవితంలో చిన్నప్పుడు జరిగిన సంఘటనల దగ్గరి నుంచి, ఆయన చెప్పిన మాటల నుంచి.. వేసిన జోకుల వరకూ… ప్రతీదీ కవర్ చేసేయాలన్న తపన మీడియాలో కనిపిస్తోంది. నిజానికి ఇదంతా ఆయన మీద భక్తి అందామా? కాదు. ప్రస్తుతం ఆయన ఒక ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఈ ఆసక్తి.. హడావిడి!

చావో రేవో.. టాపిక్ దొరికింది చాలు!

ఒక మనిషి మరణించినప్పుడు ఆయన గురించి తలుచుకోవాలి. ఆయనకి సంబంధించిన విషయాలు నెమరు వేసుకోవాలి. ఇది మంచిదే! నిజంగా మనిషన్నవాడు చెయ్యాల్సిన పని. మనిషి చనిపోయినప్పుడు ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి ఒకసారి తెలుసుకోవాలనీ, ఆయన జీవితమంతా ఏం సాధించారో ఒకసారి గుర్తు చేసుకోవాలనీ, తద్వారా ఆయనకు నివాళులర్పించాలనీ హృదయం ఉన్న ప్రతి మనిషీ కోరుకుంటాడు.

అయితే, జనాల్లో కనిపించే ఈ మానవీయ భావాల్ని పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్ చేసే క్రమంలో – మీడియా చేస్తున్న గోల ఈ మధ్య హద్దులు దాటిపోతోంది. ఒకపక్క టీవీలు, మరోపక్క వెబ్ సైట్లు … చెప్పిందే చెప్పి, చూపిందే చూపి.. విసిగిస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి విలువ తీస్తున్నాయి. ఆ వ్యక్తి గురించి గౌరవం ఉన్నా లేకపోయినా – జనానికి కావాలి కాబట్టి ఆ వ్యక్తి గురించిన సమాచారాన్ని ఇస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో విషయం లాగి … బాబోయ్‌ ఇక వద్దు అనేదాకా ఊదరగొట్టేస్తున్నాయి. పాతపత్రికలు తిరగేసి, వికీపీడియాలో శోధించి – మొత్తానికి ఏదో సమాచారాన్ని జనం నెత్తిన పడేస్తున్నాయి. వీటిలో క్వాలిటీ ఎంత? నిజాయతీ ఎంత? నిజాలు ఎన్ని? అని ఆలోచిస్తే – సమాధానం కష్టం.

గౌరవమా? గందరగోళమా?

ఒక ప్రముఖుడు పొద్దుట చనిపోయాడంటే, ఆ సాయంత్రానికల్లా ఆయన మీద కనీసం కొన్ని వేల ఆర్టికల్స్ సిద్ధమయ్యే పరిస్థితి! అవన్నీ చదివిన వ్యక్తికి ఆయన మీద పూర్తి అవగాహన ఏర్పడటం మాట అటుంచితే, విసుగెత్తి చిరాకొచ్చే ప్రమాదం కూడా ఉంది.

అయినా బతికున్నప్పుడు లేని ఆదరం ఒక్కసారిగా చనిపోగానే ఎందుకు? అదీగాక ఒక్కసారి ఆ వ్యక్తి తాలూకూ వివరాలన్నీ నెమరు వేసేసుకున్న తర్వాత, ఒక రెండు రోజులకే మనం డ్రై అయిపోతున్నాం. ఒకపని అయిపోయినట్టు, చెరుకుగడ పీల్చి పిప్పి చేసి బయటపడేసినట్లు, ” హమ్మయ్య చనిపోయిన ఆ వ్యక్తి గురించి తెలిసేసుకున్నాం… ఇంకేమీ అక్కర్లేదని ఆయన్ని మరచిపోవడం జరుగుతుంది. ఇప్పటివరకూ కరుణానిధి పేరుతో వార్తలు ఉతికేశారు. ఒక నాలుగు రోజుల తర్వాత చూడండి.. ఎక్కడా ఆ వ్యక్తి గురించిన మాటే ఉండదు. అదీ నేటి మీడియా!

చదివితే చదువు. లేకపోతే పో…

సరే. అన్ని వార్తలు ఇచ్చారు. చదివితే చదువు. లేకపోతే పో… ఇవ్వడం తప్పేంటి? – అని మీరనచ్చు. కానీ ఎంత ట్రెండీ టాపిక్‌ అయినా ఏక కాలంలో అందరూ దాని గురించే – అతిగా వివరాలు పిండి మరీ ఇస్తుంటే – అలా ఇవ్వడం వల్ల పాఠకులు మానవ సహజమైన స్పందనని కోల్పోయే ప్రమాదముంది. మరేం చేయాలి? ఇలా ప్రతి చిన్న విషయాన్నీ ఇచ్చి.. దాన్ని సొమ్ము చేసుకోవాలని తొందర పడడం కాకుండా, జనం హృదయాల్ని స్పందింపజేసే విషయాల్ని కొద్దిగానైనా ఇచ్చి – ఆ వ్యక్తి గొప్పదనాన్ని గుర్తు చెయ్యడం మంచి పని.

సుబ్బి చావు – ఎంకి పెళ్లి

ప్రముఖుల గురించి జనానికి తెలియజేయడం, వారి గొప్ప లక్షణాల్నీ వారి జీవితంలోని గొప్ప విషయాల్నీ జనానికి చెప్పడం మీడియా విధి. అందుకోసం ఏం చేయాలి? నిత్యం కొన్ని ప్రత్యేక శీర్షికలు నడుపుతూ గొప్పవాళ్ల జీవితాల్లోని గొప్ప విషయాల గురించి ఆసక్తి కరంగా రాయాలి. అంతేగానీ – చనిపోయినప్పుడు ఒక్కసారిగా వెల్లువలా వార్తలన్నీ జనం మీద పారబోసేసి, విసుగెత్తించి, మళ్లీ రెండు రోజుల్లోనే ఆ మనిషిని మరిచిపోవడం సరికాదు. మీడియా దీనిని గుర్తించాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu