ఇది ఎవరి ‘సర్కార్‌’ గురించి?

F2 Movie

గురువు ఫాలో అయిన ఫార్ములానే శిష్యుడు కూడా ఉన్నదున్నట్టు ఫాలో అయితే సక్సెస్ వస్తుందా లేదా అంటే – ఎప్పుడూ గ్యారెంటీ ఇవ్వలేం. అయితే ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ శిష్యులు ఎప్పుడూ కూడా తమ గురువు ఫార్ములానే ఫాలో అవుతూ ఉంటారు. ఒకపక్క సమాజానికి ఉపయోగపడే విషయాన్ని చెబుతూ, మరోపక్క అత్యంత భారీ నిర్మాణ విలువలతో, గ్రాఫిక్స్‌తో, టెక్నాలజీతో దాన్ని మిక్స్ చేసి – కేవలం ఓ సందేశాత్మక చిత్రంగా కాకుండా పూర్తి కమర్షియల్ చిత్రంగా చూపించగలిగే ఒక మంచి ఫార్ములాని శంకర్ కనిపెట్టాడు. తన తొలిసినిమా జెంటిల్‌మన్ దగ్గరనుంచి – నిన్నమొన్నటి రోబో వరకూ – ఏవో సినిమాల్లో తప్ప – ఆయన అన్నింటిలోనూ ఇదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. ఆయన శిష్యులైన ఏఆర్ మురుగదాస్, సుశీ గణేశన్ లాంటి వాళ్లు కూడా – సందేశం+ భారీతనం + టెక్నాలజీ = కమర్షియాలిటీ … అనే ఇదే ఫార్ములాని ఫాలో అవుతూనే ఉన్నారు. సుశీ గణేశన్‌ విక్రమ్‌ హీరోగా తీసిన ‘మల్లన్న’, మురుగదాస్ తీసిన ‘స్టాలిన్’ ‘కత్తి( ఖైదీ నంబర్‌ 150 ) ”స్పైడర్’ – లాంటివన్నీ ఇలాంటివే! మరి తమిళనాట విజయ్‌ రాజకీయ అరంగేట్రం కోసం ఉపయోగపడేలా మురుగదాస్ తీయదలచిన ‘సర్కార్’ సినిమా – శంకర్ ఫార్ములాలోనే నడిచిందా? విజయం సాధించే విధంగా ఉందా అన్నది చూద్దాం.

అక్కడ ‘ఒకే ఒక్కడు’, ఇక్కడ ‘ఒకే ఓటు’
‘ఒకే ఒక్కడు’ సినిమాలో కేవలం ఒక సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా గొడవ పెట్టుకుని ఒక్కరోజు ముఖ్యమంత్రి కావడం సంచలనం సృష్టించడం అద్భుతంగా చూపించాడు శంకర్. మురుగదాస్‌ దానినే కాస్త మార్చినట్టు అనిపిస్తుంది. అక్కడ సామాన్యుడి పాత్రని హీరో చేస్తే… ఇక్కడ హీరోని ముందుగానే ఓ పెద్ద సెలబ్రిటీగా చూపించాడు. అక్కడ ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రి అన్న పాయింట్‌ తో గేమ్‌ ఆడితే – ఇక్కడ తనకు చెందిన ‘ఒకే ఒక్క ఓటు’ గురించి గేమ్‌ ఆడడం చూపించాడు మురుగదాస్.

సందేశం + టెక్నాలజీ + భారీతనం

నిర్మాణ విలువల పరంగా భారీతనం, హడావిడి బాగానే కనిపిస్తాయి. జయలలితను పోలిన ఒక లేడీ విలన్ క్యారెక్టర్ దీంట్లో పెట్టడం, ఆ క్యారెక్టర్‌కి ఒకనాటి జయలలిత అసలుపేరు ( కోమలవల్లి ) వాడడం వివాదాస్పదమైంది. తమిళ రాజకీయాల పరంగా సినిమాను తీసినప్పటికీ – తెలుగునాట కూడా ఎన్నికల సీజన్‌ కారణంగా ఈ సినిమా ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అవుతుంది. అదే దీంట్లో ప్లస్ పాయింట్! ఇది అదృష్టమని చెప్పాలి. అయితే ఈ సినిమాలో గొప్పగా తీసిన ఎలిమెంట్స్ చాలా తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే శంకర్ ఫార్మాట్ ని స్ట్రయిట్‌గా ఫాలో అయి తీసిన ఓ మామూలు సినిమా ఇది. అయితే మొదటి ఒకటి రెండు సీన్స్ లోనే సినిమాలో కాన్‌ఫ్టిక్ట్‌ క్రియేట్‌ చేసి- మన ఆసక్తిని లాక్‌ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ గొప్పగా లేదు.

జనసైనికులకి నచ్చితే లక్కీ!
సెకండాఫ్ లో గొప్ప మలుపులు ఉండక పోయినా పరవాలేదు, ఆసక్తికరంగానే సాగింది. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ యాక్షన్ బాగుంది. విజయ్ నటన బాగున్నప్పటికీ అతని మాట స్టైల్‌, నడక స్టైల్ – తెలుగువారి మైండ్ సెట్ కి సరిపడే విధంగా ఉండవన్నది చాలామంది అభిప్రాయం. తమిళ హీరోలయిన సూర్య కార్తీ తెలుగులో నిలదొక్కుకున్నప్పటికీ – విజయ్ తుపాకి లాంటి మంచి సినిమాలు ఇచ్చినా – తెలుగులో నిలదొక్కుకోలేకపోవడానికి ఇదే కారణం. ఏదేమైనా నటనపరంగా చూస్తే – విజయ్ బాగానే చేశాడు. అయితే ఊహించని గొప్ప థ్రిల్లింగ్‌ ఏదీ ఈ సినిమాలో లేకపోవడం పెద్ద మైనస్. ఏమైనా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో – ఈ ఎలక్షన్‌ సీజన్లో ఈ సినిమా రావడం అదృష్టం. కొత్త రాజకీయాలు కోరుకునే జనసేన పద్ధతిలో సాగే సీన్స్‌ కొన్ని సినిమాలో ఉన్నాయి. అవి జనసైనికుల అభిమానాన్ని పొందితే – సినిమా కచ్చితంగా నిలదొక్కుకుంటుంది. లేదంటే యావరేజ్‌గా మిగిలిపోతుంది. అంతే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu