అయ్యబాబోయ్‌! ‘సైబర్‌ సెక్యూరిటీ’ గురించి మాకేం తెలీదు!

SriRamaNavami

“శివుని విల్లు ఎవరు విరిచారు? అంటే – అయ్యబాబోయ్‌! నాకేం తెలీదు. నేను విరవలేదు” అన్నాట్ట ఎవడో! సైబర్‌ సెక్యూరిటీ గురించి కూడా అవగాహన ఇలాగే ఉంది జనాల్లో! అబ్బే. ఇండియాలోనే కాదు. అమెరికాలో కూడా అంతే! విషయం ఏంటంటారా? చదవండి మరి!

పెద్దలు సరే… పిల్లలు కూడా ప్రతీక్షణం స్మార్ట్ ఫోన్‌తోనే గడుపుతున్న ఈ రోజులు. తల్లితండ్రుల్ని పిల్లల్ని పట్టించుకునే తీరిక లేని కాలంలో వాళ్లు ఆన్‌ లైన్లో ఏం చేస్తున్నారో అసలు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ కొత్త తరంలో రకరకాల కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. పిల్లలకి మాయమాటలు చెప్పేవాళ్లు, తాము చెప్పింది తల్లిదండ్రులకు చెప్పవద్దని బెదిరించేవాళ్లు, బాధపెట్టేవాళ్లు… దుర్మార్గులు ఆన్‌లైన్‌లో చాలామంది ఉన్నారు. పిల్లల్ని ఆన్‌ లైన్‌ ద్వారా మాటలతో వశం చేసుకుని – బెలిపించి, భయపెట్టి, బాధపెట్టి, ఎక్స్‌ ప్లాయిట్‌ చేసే నేరాన్ని ‘సైబర్ బుల్లీయింగ్’ అంటారు.

పాపం ఏమీ తెలియని పిల్లలు ఈ ఆన్ లైన్ మోసగాళ్లకి బలై ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పక్క – ఆన్‌ లైన్లో పిల్లలు చూడకూడని అశ్లీల విషయాలు కూడా వాళ్ల కంట పడే ప్రమాదం బాగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ నుంచి పిల్లలకు భద్రత అన్నది చాలా ముఖ్యమైన విషయంగా మారింది. మరి ఆన్ లైన్ సేఫ్టీ గురించి ఈ పిల్లల తల్లిదండ్రుల్లో ఎంతమందికి అవగాహన ఉంది? ఇది తెలుసుకోవడానికి అమెరికాలో ఇటీవల ఒక సర్వే నిర్వహించారు.

2,500 మంది అమెరికన్ తల్లిదండ్రుల్ని ఇంటర్వ్యూ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. కేవలం 24 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే… తమ పిల్లలు ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉంటారనే భరోసాను కలిగి ఉన్నారట! 76 శాతం మంది తమ పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి కలవరపడుతూనే ఉన్నారట. అసలు ‘ఆన్ లైన్ సేఫ్టీ’ గురించి తల్లిదండ్రులకు ఎంత అవగాహన ఉందని ఒక ప్రశ్న వేసుకుంటే – 36 శాతం మందికి అసలు సైబర్ సెక్యూరిటీ పట్ల సరయిన అవగాహనే లేదని తేలింది.

అసలు మీరు ‘సైబర్ సెక్యూరిటీ’ గురించి ఎప్పుడు విన్నారు? ప్రాథమికంగా ఈ విషయాలు ఎప్పుడు తెలుసుకున్నారు? – అని కొందరు అమెరికన్స్‌ ని అడిగినప్పుడు – కొందరు స్కూల్ స్థాయిలో, కొందరు కాలేజీ స్థాయిలో, కొంతమంది ఉద్యోగ స్థాయిలో విన్నామని చెప్పారు. 36 శాతం మందికి అసలు అవగాహనే లేదట.

మరి టెక్నికల్‌ గా ఎంతో ఎదిగిందనుకునే అమెరికాలోనే ఇలా ఉంటే – మరి మన భారతదేశంలో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఆలోచించాలి. స్మార్ట్‌ ఫోన్లూ కంప్యూటర్లూ ఇంకా అందరికీ అందుబాటులో రాలేదుగానీ… లేకపోతే – అసలే చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు పెరుగుతున్న ఈ కాలంలో సైబర్‌ బుల్లీయింగ్‌ కూడా ఎక్కువైతే – ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే తల్లితండ్రులు ఇప్పటినుంచే సైబర్‌ సెక్యూరిటీ గురించీ ఆన్‌లైన్‌ భద్రత గురించీ తాము అవగాహన పెంచుకుని పిల్లలకి కూడా పెంచాలి. లేదా టీనేజర్స్‌ కే ఎక్కువ విషయాలు తెలిసి ఉంటే – సిగ్గుపడకుండా వాళ్లనుంచి నేర్చుకోవాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu