అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు సినిమా విలువింతేనా?

PremaLekhalu

ఈ మధ్యే సూపర్‌హిట్‌ మూవీ గూఢచారి అమెజాన్‌ ప్రైమ్‌లో ఇచ్చారు. కానీ అది ఎక్కడుందో వెతికి పట్టుకోవాలన్నా కష్టమే అన్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే – అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సైట్లో తెలుగు సినిమాలకి ఇచ్చే ప్రాధాన్యం అలాంటిది మరి!

అమెజాన్ ప్రైమ్ వీడియో సౌకర్యం భారతదేశానికి కూడా రావడం సంతోషకరం. అయితే ఇప్పటికీ అమెజాన్ లాంటి విదేశీ సంస్థలు – భారత దేశం అంటే కేవలం హిందీ మాత్రమే – భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్‌ మాత్రమే – అనే ధోరణిలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది. బాహుబలి, 2.0 లాంటి ఎన్నో గొప్ప చిత్రాలు తెలుగునుంచీ, తమిళం నుంచీ వస్తున్నప్పటికీ – ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ ఇంగ్లీష్ హిందీలకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా విచారకరం.

అమెజాన్ ప్రైమ్ కొత్త సినిమాలను ప్రమోట్ చేసేందుకు primevideo.com సైట్లో పైన ఒక స్లైడ్‌ షో ఇస్తుంటుంది. అందులో ఒక డజను స్లైడ్స్‌ నిత్యం రన్‌ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో ఎంత సేపూ ఇంగ్లిష్‌ హిందీ సినిమాల ప్రకటనలే తప్ప – తెలుగు భాషలో ఎంత కొత్త సినిమా వచ్చినా ప్రముఖంగా స్లైడ్‌లో చూపించడం లేదు. కేవలం కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, హిందీ సినిమాలకు మాత్రమే ఈ టాప్‌ స్థానం పరిమితమయింది. అప్పుడప్పుడు అరుదుగా తమిళ సినిమాలు కనిపిస్తాయి. అంతేగానీ తెలుగు కి మాత్రం చోటే దక్కడం లేదు. భరత్ అనే నేను, రంగస్థలం లాంటి మూవీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ఉన్నాయి. ఇటీవల గూఢచారి మూవీ కూడా ప్రైమ్‌లో ఇచ్చారు. అయినా వీటికి తగిన ప్రాధాన్యం లేదు. ఒక్కసారయినా స్లైడ్‌ షోలో టాప్‌ ప్రయారిటీ ఇవ్వడం లేదు.

అమెజాన్‌ ప్రైమ్‌ లో ఒక కొత్త తెలుగు సినిమా వచ్చిందనగానే ఎవరికైనా తెలియాలి కదా? అందుకే ప్రమోషన్‌ కోసం వ్యూయర్‌షిప్‌ పెంచుకునే ఉద్దేశంతో యాడ్స్‌ ఇవ్వడం జరుగుతోంది. కానీ సైట్లోకి వెళ్లి చూస్తే మాత్రం ఓవరాల్‌ గా తెలుగు అనేది ఓ మూల పడి ఉంటుంది. ఏ కొత్త సినిమా ఇచ్చారా అని కేటగిరీల్లోకి పోయి కష్టపడి వెతుక్కోవాల్సిందే! కాస్త కనిపించేలా ప్రముఖంగా స్లైడ్‌ షోలో ఇవ్వరు. ఏవో దిక్కుమాలిన ఇంగ్లీష్ సీరియల్స్ కూ, టీవీ షోస్‌ కీ ఇచ్చిన ప్రాధాన్యం కూడా హిట్టయిన తెలుగు సినిమాలకి ఇవ్వకపోవడం ఎంత దారుణం! దీని గురించి అమెజాన్ ఆలోచించాల్సిందే!

అమెజాన్‌ వాళ్లు ప్రముఖంగా చూపిస్తున్నవి వాళ్ల దృష్టిలో గొప్ప సినిమాలూ సీరియల్స్‌ కాదని అనడం లేదు. కానీ అమెజాన్‌ ఇండియా పేరుతో వచ్చి భారతీయ సినిమా ప్రేక్షకులతో వ్యాపారం చేస్తూ – భారతీయ సినిమాకే బాహుబలి లాంటి తెలుగు కి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఎంతవరకు సబబో అమెజాన్‌ ఆలోచించాలని ‘తెలుగువాడు’ చేస్తున్న డిమాండ్‌. ఒక తెలుగువాడిగా ఇది ఒక న్యాయమైన డిమాండ్‌. మరి అమెజాన్‌ ఏమంటుందో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu